విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వీడియోపై ఆలయ అధికారులు స్పందించారు. భద్రతా లోపంపై స్వతంత్ర టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించి ఆలయ కమిటీ.. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి ఘటనపై దర్యాప్తు చేపట్టింది. విచారణలో కొందరు అనుమానితులను గుర్తించారు. దేవస్థానం పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పోలీసులకు చేరింది వీడియో వ్యవహారం.
విజయవాడ దుర్గగుడి తరుచూ వివాదంలో చిక్కుకుంటుంది. భక్తులు పరమపవిత్రంగా భావించే అమ్మవారి మూలవిరాట్ ను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధమైనప్పటికీ… భద్రతా ఉన్న ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం, ఏకంగా అమ్మవారి మూలమూర్తిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంపై భక్తులు ఫైర్ అయ్యారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు..? సీసీ కెమెరాలను కూడా సిబ్బంది పరిశీలిచడం లేదా అంటూ నిలదీశారు. అమ్మవారి ప్రతిష్ట దెబ్బ తీసేలా వ్యవహారిస్తున్న ఆకతాయాకులపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అని భక్తులు ఆందోళన చెందడంపై కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర టీవీ. దీనిపై స్పందించిన అధికారులు చర్యలకు పూనుకున్నారు.