– సోము వీర్రాజుపై పోస్టింగ్ వ్యవహారం కొత్త మలుపు
– సోముపై పోస్టింగ్ పెట్టారంటూ సొంత పార్టీ నేతపై డీజీపీకి ఫిర్యాదు
– తనకు సంబంధం లేదని బీజేపీ సీనియర్ నేత రాంకుమార్ వాదన
-రాంకుమార్ ఐపి నెంబర్ నుంచే వచ్చిందన్న అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజా
– యార్లగడ్డ రాంకుమార్‌పై డీజీపీకి లక్ష్మీపతిరాజా ఫిర్యాదు
– లక్ష్మీపతి చర్యపై ఆగ్రహించిన రాంకుమార్
– లక్ష్మీపతిరాజాను సస్పెండ్ చేయాలని డిమాండ్
– లేకపోతే సోము వీర్రాజుపై పరువునష్టం దావా వేస్తానన్న రాంకుమార్
– ఆఫీసు బేరర్లపైనా పరువునష్టం వేస్తానన్న రాంకుమార్
– మరి లక్ష్మీపతిరాజాపై సోము చర్య తీసుకుంటారా?
– సస్పెండ్ చేయకపోతే పరువునష్టం కేసు తప్పదు
– సస్పెండ్ చేస్తే సొంత మనిషిని కాపాడలేకపోయారన్న అప్రతిష్ట
– సంకటంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. తన పార్టీ అధికార ప్రతినిధి చేసిన ఫిర్యాదు, ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ‘పరువు’కొచ్చిపడింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడే, సోము వీర్రాజుపై పరువునష్టం దావా వేస్తాననే స్థాయికి, కమలం కీచులాటలు చేరడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
కాకినాడకు చెందిన బీజేపీ సీనియర్ నేత, గతంలో రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన యార్లగడ్డ రాంకుమార్ ఇప్పుడు ఆ పార్టీలో సంచలనం సృష్టిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు తీవ్ర అస్వస్థత అంటూ, యార్లగడ్డ రాంకుమార్ ఐపి నెంబర్ నుంచి, సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారన్నది బీజేపీ నాయకత్వం అభియోగం.
ఎయిమ్స్‌లో సోముకు వైద్యచికిత్స జరుగుతున్నట్లు, ఫేక్ పోస్టు సృష్టించారన్నది ఆ అభియోగ సారాంశం. ఆ మేరకు తమ అధ్యక్షుడు సోము వీర్రాజుపై దుష్ర్పచారం చేస్తున్న.. కాకినాడ బీజేపీ నేత యార్లగడ్డ రాంకుమార్‌పై చర్య తీసుకోవాలని.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సోషల్ మీడియా ఇన్చార్జి లక్ష్మీపతిరాజా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం, పార్టీలో కలకలం సృష్టించింది. బీజేపీ చరిత్రలో ఈవిధంగా సొంత పార్టీ నేతపై రాష్ట్ర నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి.
ఇప్పటికే సోము వీర్రాజుకు వ్యతిరేకంగా కోర్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు జాతీయ పార్టీకి ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతపైనే, పార్టీ నాయకత్వం ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇది ఏపీలో పార్టీ క్రమశిక్షణను వెక్కిరించినట్లయింది.
తనపై సొంత పార్టీ నాయకత్వం పాల్పడిన చర్యకు, రాంకుమార్ మనస్తాపం చెందారు. సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఉంటూ అమెరికాలో ఉద్యోగం చేసి, బీజేపీలో చేరిన తాను.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎలా పోస్టింగులు పెడతానని రాంకుమార్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ పోస్టింగు తన ఐపి నుంచి వచ్చినట్లు, అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజా ఎలా నిర్ధారించారని రాంకుమార్ నిలదీశారు.
పోలీసులకు మాత్రమే, దానిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ఉంటుందని గుర్తు చేశారు. ఇది ఒకరకంగా ఫోన్ ట్యాపింగ్ లాంటిదేనని ఆయన స్పష్టం చేశారు. తన పేరుతో మరొకరు ఫేక్ ఐడి సృష్టిస్తే, అందుకు తానెలా బాధ్యుడినవుతానని రాంకుమార్ వాదిస్తున్నారు.
పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజా చర్యతో వ్యక్తగతంగా తనొక్కడి పరువు మాత్రమే కాకుండా, తన కుటుంబం లాంటి పార్టీ పరువు కూడా బజారుకెక్కిందని రాంకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అంటే కుటుంబం అని, కుటుంబపెద్ద లాంటి అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ వ్యవహారాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై సోము వీర్రాజుకు అత్యంత సన్నిహితుడు, పార్టీ వ్యవహారాలను తెరవెనుక చక్రం తిప్పేరాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకరు.. రాంకుమార్‌కు ఫోన్ చేసి హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాంకుమార్.. పార్టీ ముందు రెండు డిమాండ్లు ఉంచడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు వ్యతిరేకంగా డీజీపీకి తప్పుడు ఫిర్యాదు చేసిన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, సోషల్‌మీడియా ఇన్చార్జి లక్ష్మీపతిరాజాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాంకుమార్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పార్టీ ఆఫీసు బేరర్లపై పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరించారు.
ఆ మేరకు ఆయన సోము వీర్రాజుకు లేఖ కూడా రాశారు. జాతీయ అధ్యక్షుడు నద్దాకు సైతం ఆయన ఈ లేఖ పంపించడం విశేషం. గతంలో కనా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లక్ష్మీపతిరాజాను ఒకసారి సస్పెండ్ చేసిన విషయాన్ని రాంకుమార్ గుర్తు చేశారు.
కాగా ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడం, పార్టీ నేతలకు కలవరం కలిగిస్తోంది. సొంత పార్టీ వ్యవహారం ఈవిధంగా పోలీసులకు చేరడం ఎప్పుడూ జరగలేదని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని రాంకుమార్ జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం, అటు రాష్ట్ర నాయకత్వానికీ ఇరకాటంగా పరిణమించింది.
ఈ మొత్తం వ్యవహారంపై.. గత రెండు రోజుల నుంచి పార్టీలో రచ్చ జరుగుతున్నప్పటికీ, దిద్దుబాటు చర్యలకు దిగాల్సిన సంఘటనా మంత్రి మధుకర్‌జీ, నిర్లిప్తంగా ఉండటంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేవలం ఆయన మౌనం, నిష్క్రియాపర్వం వల్లే పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాను ఒక వర్గానికి చెందిన నాయకుడిని కాదని, ఆయన ఇంతవరకూ తన చర్యల ద్వారా నిరూపించుకోలేకపోయారంటున్నారు.
కాగా తాజా పరిణామాలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సంకటంలా పరిణమించాయి. యార్లగడ్డ రాంకుమార్ డిమాండ్ చేసినట్లు.., పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజాను సస్పెండ్ చేయాలా? లేక పరువునష్టం కేసుకు సిద్ధపడాలా? అన్నదే సోము సంకటానికి కారణం.
ఒకవేళ లక్ష్మీపతిరాజాను సస్పెండ్ చేస్తే.. కీలక సమయంలో తన సొంత మనిషిని కాపాడుకోలేకపోయారన్న, అప్రతిష్ఠను మూటకట్టుకోవలసి వస్తుంది. అలాగని పరువునష్టం కేసుకు సిద్ధపడితే, తనతో సహా మొత్తం ఆఫీసుబేరర్లు మొత్తం కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇదీ ఆయన మరో సంకటం! చూడాలి.. సోము ఏం నిర్ణయం తీసుకుంటారో?