ఓవైపు భానుడి భగభగ.. మరోవైపు ముంచుకొస్తున్న పోలింగ్ సమయం. దీంతో అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని మార్చేశారు. తక్కువ టైంలో ఎక్కువ మందే టార్గెట్‌గా సమయం లేదు మిత్రమా అంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటి ప్రచారంతో టైం వేస్ట్ అనుకున్న నాయకులు గుంపు ఎక్కడుంటే అక్కడి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచార హోరుతో ఊరూ వాడలా నేతల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం ముంచుకొస్తుం డటంతో ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సమయం లేదు మిత్రమా అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఇంటింటి ప్రచారంతో టైం వేస్ట్ చేయకుండా.. గుంపు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు. కుల సంఘాలతోపాటు, ఉపాధి హామీ ప్రదేశాల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు వంటి ప్రచార కార్యక్రమాలతో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఉన్న టైంలోనే అన్ని నియోజకవర్గాలు చుట్టేయడమే లక్ష్యంగా కుంటుంబ సభ్యులను సైతం ప్రచార రంగంలోకి దించు తున్నారు. ఓవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే.. మరోవైపు ఆర్థిక భారం పడుకుంటా జాగ్రత్త పడుతు న్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తోంది. ఉదయం, సాయంత్రం వేళ తప్ప మధ్యాహ్నం కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. దీంతో అభ్యర్థులు అందుకు అనుగుణంగా తమ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా వాకింగ్ చేస్తున్న వారిని కలిసేందుకు ఉదయమే పార్కులు, గ్రౌండ్లకు, స్టేడియాలకు పరుగులు తీస్తున్నారు. ఆ తర్వాత రైతులు, కూలీలు, కార్మికులను నేరుగా కలిసేందుకు మార్కేట్లకు వెళ్తున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో ఇంటింటి ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏసీ ఫంక్షన్స్ హాల్స్‌లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం మళ్లీ ఎండ తీవ్రత తగ్గగానే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతోపాటు చిన్న చిన్న సమావేశాలకు అటెండ్ అవుతూ ప్రచారం సాగిస్తున్నారు. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుని.. కుటుంబ సభ్యులను కూడా ప్రచార రంగంలోకి దించుతున్నారు.
మరోపక్క ఎన్నికల కౌంట్‌డౌన్‌కు సమయం ఆసన్నమైంది. దీంతో టైం మేనేజ్‌మెంట్‌తో పాటు, ఖర్చు భారంపై అభ్యర్దులు ఫోకస్ పెట్టారు. కార్యకర్తలతో ప్రతీ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో తలకు మించిన భారంగా మారుతుంది. దీంతో తక్కువ మంది కార్యకర్తలు, తక్కువ ఖర్చుతో ప్రచారం చేసేలా అభ్యర్ధులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆటోలు, మిని వ్యాన్‌లకు ఫ్లేక్సీలను కట్టించి సౌండ్ భాక్సులు ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఎలాగైనా గెలుస్తామన్న నమ్మకం ఉన్న అభ్యర్ధులు మాత్రమే కాస్త ధైర్యంగా డబ్బు ఖర్చు చేస్తుండగా.. మిగిలిన వారు మాత్రం ముందు వెనకా ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. ఇలా తమపై ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రచార వ్యూహాన్ని మార్చుకుని గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు అభ్యర్థులు. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయి..? విజయం ఎవరిని వరిస్తుంది..? గెలిచే అభ్యర్థి ఎవరు..? ఓటమి రుచి చూసేది ఎవరు అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


