ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈనెల 10 వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. టికెట్లు ,టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామని అన్నారు. 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందని చెప్పారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేశామన్నారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు.
సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేశామన్నారు. సీఎం ఆదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని బీఆర్ నాయుడు తెలిపారు.
3 వేల సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని బీఆర్ నాయుడు చెప్పారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదని అన్నారు. అందరు భక్తులతో కలిసి SSD టోకెన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. టోకెన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.
తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపలేరన్నారు. అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరుతున్నానని చెప్పారు. HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో …భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.