- ఫ్లెక్సీలు, కటౌట్లు, తోరణాలతో గులాబీమయమైన ఖమ్మం
- హాజరుకానున్న 4రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- 100 ఎకరాల్లో 5 లక్షలమందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు
- సభావేదికపై కేసీఆర్, కేజ్రీవాల్, విజయన్, అఖిలేష్
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ రేపు ఆవిర్భావ సభ నిర్వహణకు సన్నద్ధమైంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో.. దీన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తున్నారు. ఈ సభలో కేసీఆర్‌తో పాటు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు.
బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, కేరళ సీఎం విజయన్.. పాల్గొనబోతున్నారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, పలువురు వామపక్ష నేతలు కూడా ఈ సభలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. కీలకమైన సభ కావడంతో.. ఇక్కడ సీఎం కేసీఆర్ ఏ రకమైన ప్రకటన చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
వందమంది ప్రముఖుల కోసం ఇప్పటికే సిటీలోని హోటల్ గదులన్నీ బుక్చేశారు. సభకు ఐదు లక్షలమందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న లీడర్లు.. ఇందుకోసం వందలాది ఆర్టీసీ బస్సులను సభకు మళ్లిస్తున్నారు. బస్సులు సరిపోని చోట ప్రైవేట్ స్కూల్బస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. వంద ఎకరాల్లో జరగనున్న సభ కోసం 448 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ అంతటా కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో నింపేశారు. పలువురు ఐపీఎస్‌లు, ఐజీ ర్యాంక్ అధికారులకు ఖమ్మం మీటింగ్ కోసం డ్యూటీలు వేశారు. ఖమ్మం నుంచి వైరా వెళ్లే రోడ్డులో కొత్త కలెక్టరేట్ వెనకాల సభాస్థలి ఉండగా, ముందు వరుసలో 5 వేలమంది కూర్చునేందుకు వీలుగా సోఫాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పబ్లిక్ మీటింగ్ కోసం బీఆర్ఎస్ పార్టీ రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని చర్చ జరుగుతుంది