భారీ వర్షాలు, వరదల నుంచి తెలుగు రాష్ట్రాలు తేరుకోకముందే మరోసారి వానగండం పొంచిఉంది. ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేయగా.. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాలు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెం.మీ వర్షపాతం నమోదయింది. ఇప్పటికే వరుణుడి ప్రతాపంతో వరద గుప్పిట్లో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపు గత వారంలో రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.