చిరుతపులి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సంచరిస్తోందని ఇన్నాళ్లూ భావించిన అటవీ శాఖ అధికారులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ చిరుత పులి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కడియం నర్సరీలో చిరుత పులి సంచరిస్తోందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఇప్పుడు కోనసీమ జిల్లాలోని ఆలమూరు, మండపేట మండలాల పరిధిలో సంచరించే అవకాశాలున్నాయని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పశువుల కొట్టాల వద్ద వొంటరిగా ఉండరాదని, వ్యవసాయ పనుల కోసం అందరూ కలిసికట్టుగా తిరగాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా అనుమానాలు కానీ, అడుగుజాడలు కానీ కనిపిస్తే వెంటనే అధికార యంత్రాంగానికి తెలియజేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద రావు సూచిస్తున్నారు.