స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మణిపుర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.
రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలకు దిగాయి. ఆ ఆందోళనలు హింస్మాత్మకంగా మారడంతో కొన్నిరోజుల పాటు ఆ రాష్ట్రం అగ్నిగుండంలా తయారైంది. వివిధ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి నివురుగప్పిన నిప్పులా ఆ రాష్ట్రంలో తాజాగా మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.