అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనేక వెబ్‌సైట్ల నుండి ఆమె ఆరోగ్యం గురించి ఫేక్, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తొలగించాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.
కంటెంట్‌ను తొలగించడానికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ఖాతా బాలీవుడ్ టైమ్స్ , ఇతర వెబ్‌సైట్‌లను ఆదేశించిన గత ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఆమె తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు.
నటుడు అమితాబ్ బచ్చన్ 13 ఏళ్ల మనవరాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. గూగుల్‌కు నోటీసు జారీ చేసింది.
తన ఆరోగ్యానికి సంబంధించి యూట్యూబ్‌లో ఫేక్, తప్పుదోవ పట్టించే వీడియోలు తొలగించాలని కోరుతూ ఆరాధ్య బచ్చన్ గతంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఆధారంగా ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన నకిలీ వీడియోలను వెంటనే తొలగించాలని ఏప్రిల్ 20, 2023 న హైకోర్టు యూట్యూబ్‌ను ఆదేశించింది.
కొన్ని వీడియోల్లో అయితే ఆరాధ్య బచ్చన్ ఇక లేరని రాశారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తి, సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ముఖ్యంగా వారి శారీరక , మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే.. వాళ్లకంటూ ఓ గౌరవం ఉంటుందని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
కొన్ని వెబ్‌సైట్లు , సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు హైకోర్టు ఉత్తర్వులను పాటించకపోవడంతో రెండో పిటిషన్ దాఖలు చేశారు ఆరాధ్య బచ్చన్. తదుపరి విచారణను కోర్టు మార్చ్ 17కు వాయిదా వేసింది.