గుడి పూజారితో భక్తులు తన్నించుకునే విచిత్ర సంప్రదాయం

పల్లెటూరు భాగ్యసీమ. పాడి పంటలకు లోటు లేని సీమ. మంచితనం, మమకారం మనిషి మనిషిలో కనపడే చల్లని సీమ గ్రామసీమ. ప్రాచీన సంప్రదాయాలను, పవిత్ర ఆచారవ్యవహారాలను గ్రామ ప్రజలు తూచ తప్పక పాటిస్తారు. అయితే, పల్లెవాసులు మూఢాచారాలను సైతం గాఢంగా నమ్ముతారు. పూజారి కాలితో తన్నితే మోక్షం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా చిన్నహోతురు గ్రామవాసులు విశ్వసిస్తారు. పూజారి తన్నుడు భక్తి క్రీడ గురించి ఆలయ చరిత్ర సైతం తెలియజేస్తోంది.

పరాయివ్యక్తిని పొరపాటుగా టచ్ చేసినా, కాలు తగిలినా, చెయ్యి తగిలినా..సారీ చెబుతాం, క్షమించమని అభ్యర్థిస్తాం. అయితే, తన్నులు తినడమే పరమావధిగా భావించే గ్రామస్థులు, ఆ తన్నుల తంతును ఆలయ పూజారే నిర్వహించాలని వాంఛించే ప్రజలు ఉన్నారు తెలుసా..! ఇదేం చోద్యం, ఇదేం వింత అని ఎవరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా, ఇది అసలు సిసలు నిజం.

కర్నూలు జిల్లా అంటేనే ఆలయాల నిలయం అనే మాట స్ఫురణకు వస్తుంది. ఆధ్యాత్మిక శోభ, ధార్మిక కార్యక్రమాలతో విరాజిల్లే కర్నూలు జిల్లాలో ఎన్నో మహత్తర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక జిల్లాలోని గ్రామాల్లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, ఆధునిక దేవాలయాలను నెలకొని ఉన్నాయి. జిల్లాలోని ఆస్పరి మండలం చిన్న హూతురు గ్రామంలో శ్రీ సిద్దరామేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల చివరి రోజు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే, ఈ వేడుకల్లో భాగంగా కొన్ని వింత ఆచారాలను ఇక్కడ నిర్వహిస్తారు.

చిన్న హూతురు గ్రామ సిద్ధరామేశ్వరస్వామి ఆలయ రథత్సవ వేడుకల్లో పూజారి భక్తులను కాలితో తన్నుతారు. పూజారి పాదస్పర్శతో పునీతం అవుతామని, మోక్షం సిద్ధిస్తుందని గ్రామస్థులు గాఢంగా విశ్వసిస్తారు. పూజారి కాలితో తన్నుడు తంతు పూర్తయ్యాకే ఆలయంలో పూజలకు భక్తులు వెళతారు. భక్తులను పూజారి కాలితో తన్నే ఆచారానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఆలయ చరిత్ర ప్రకారం…మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివుడు భక్తుడు. ఆయన అయిదు శతాబ్దాలకు పూర్వం ఒక ఆలయం నిర్మించారు. ఆ ఆలయంలో తన విగ్రహాన్ని సైతం సిద్ధ రామేశ్వర స్వామి ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏటా కర్నాటక లోనే హంపి వీరుపాక్షి స్వామి రధోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్నహోతురు లో సైతం అదే తరహాలో మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించే వాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ఉత్సవాల చివరి రోజున సిద్ధ రామేశ్వర స్వామి శివ పార్వతులకు కళాణ్యం జరిపించే వారని, ఈ విషయం ఆలయ చరిత్రలో ఉందని భక్తులు తెలియజేస్తున్నారు. అర్చకస్వామి పాదంతో భక్తులను స్పృశించే క్రీడను తాము భక్తి క్రీడ, ప్రాచీన సంప్రదాయంగా నిర్వహించుకుంటున్నామని గ్రామ సర్పంచ్ హరికృష్ణ తెలిపారు.

శివపార్వతుల కల్యాణం లో శ్రీ సిద్ద రామేశ్వర స్వామి భక్తులు కొన్నితప్పులు చేయడం తో వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది. శరభ, శరభ, హ శరభ.. అంటూ వీరభద్రస్వామి నాట్యం చేస్తూ తప్పిదాలు చేసిన భక్తులను కాలితో తన్నినట్టు స్థల పురాణం తెలియజేస్తోంది. నాటి నుంచి ఆలయ పూజారి రూపంలో వీరభద్రస్వామి గుడిలో నాట్యం చేస్తూ భక్తులను తన్నడం ఆచారంగా వచ్చింది. త్రిశూలం చేతబట్టి, తన తల్లిదండ్రులైన పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను శిరస్సుపై ఉంచుకుని వీరభద్రస్వామి రూపంలో ఉన్న పూజారి ఈ తన్నుడు తంతు నిర్వహిస్తారని భక్తులు తెలిపారు. అయిదు వందల ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని తాము ఇప్పటికీ పాటిస్తున్నామని, దీనిని భక్తి క్రీడగా నిర్వహించుకుంటామని తెలిపారు. ఈ ప్రాచీన ఆచారాన్ని, ఇందుకు సంబంధించిన కథనాలను ఆలయ పూజారి జగదీశ్వరస్వామి వివరించారు.

ఆలయ అర్చకస్వామి ఒక పద్దతిలో ఉగ్ర నాట్యం చేస్తూ వరుస క్రమంలో తమను కాలితో తన్నుకుంటూ వెళతారని భక్తులు తెలిపారు. పూజారి కాలితో తన్నే ప్రక్రియను తాము సహృదయంతో స్వీకరిస్తామని, ఈ ఆచార ఘట్టం పూర్తయ్యాకే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు. పూజారి పాదం తగిలితే మోక్షం సిద్ధిస్తుందని ఆలయ చరిత్ర చెబుతోందని, అందుకే దీనిని తాము ప్రతి ఏడాది తప్పక పాటిస్తున్నామని తెలిపారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం అనంతరం స్వామివారికి గ్రామ భక్తులు వసంతోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో గులాబీ వర్ణ జలాలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. అనంతరం గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగునీళ్లు తయారు చేసి, ఆ గులాబీ రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ గ్రామస్థులు వసంతోత్సవ వేడుక నిర్వహించుకుంటారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్