వర్తమాన భారత రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో దూకుడుకు మమతా బెనర్జీ పెట్టింది పేరు. దీంతో ఫైర్ బ్రాండ్‌గా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ మౌలికంగా బెంగాల్‌కు పరిమితం. అయినప్పటికీ మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పట్టుదలకు, మొండితనానికి ఆమె పెట్టింది పేరు.
మమతా బెనర్జీ రాజకీయ జీవితం 1970 దశకంలో ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్‌తో ఆమె రాజకీయ జర్నీ ప్రారంభమైంది. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహా యోధులు ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రతో ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి నాయకురాలిగా మమతా బెనర్జీ ఎదిగారు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి సీపీఎం అగ్రనేత సోమ్‌నాథ్ ఛటర్జీని మమతా బెనర్జీ ఓడించారు. మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఇదొక కీలక ఘట్టం. సోమ్‌నాథ్ ఛటర్జీ ఓటమితో వామపక్షాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సోమ్‌నాథ్ ఛటర్జీ ఓటమిని వామపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోయారు.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పేరు దేశమంతా మారుమోగింది. ఆ తరువాత బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
దాదాపు 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో మమత కొనసాగారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి 1998లో మమతా బెనర్జీ గుడ్‌బై కొట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అలుపెరుగని పోరాటం చేస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బలీయమైన శక్తిగా రూపొందించారు మమత.
తృణమూల్ కాంగ్రెస్ బలపడటంతో బెంగాల్లో కీలక నేతగా ఎదిగారు మమతా బెనర్జీ. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. దీంతో 2011 మే 20న తొలిసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా మమత రికార్డు సృష్టించారు.
ఆ తరువాత 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక 2021లో జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా బెంగాల్ ఐడెంటిటీని రెచ్చగొట్టింది. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది.
ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరి పోరు చేసింది. వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామ్య పక్షమే. దీంతో కూటమిలో భాగస్వామ్య పక్షంగా బెంగాల్లో టీఎంసీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలి. అయితే హస్తం పార్టీతో జట్టు కట్టడానికి నో చెప్పింది తృణమూల్ కాంగ్రెస్.
కాంగ్రెస్‌తో పొత్తుకు మమతా బెనర్జీ నో చెప్పడానికి ఆమెకు కొన్ని కారణాలు లేకపోలేదు. ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో బెంగాల్లో కూడా లెఫ్ట్ పార్టీలకు కొన్ని సీట్లు తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మమతా బెనర్జీ మొదట్నుంచీ వామపక్షాలకు వ్యతిరేకం. దీంతో వామపక్షాలకు సీట్లు కేటాయించడానికి మమతా బెనర్జీ సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో బెంగాల్లో కాంగ్రెస్ తో పొత్తుకు టీఎంసీ నిరాకరించింది. దీంతో ఈసారి బెంగాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్, మరో వైపు భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు కాంగ్రెస్, వామపక్షాలు ఒక జట్టుగా బరిలో నిలిచాయి.
కథ అక్కడితో ఆగలేదు. ఇండియా కూటమికి తాము బయటి నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. టీఎంసీ చీఫ్ చేసిన ఈ కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. టెక్నికల్‌గా ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, ఇండియా కూటమిలోనే ఉంది. ఏమైనా ఈసారి రెండు జాతీయ పార్టీలను ఢీకొన్నది మమతా బెనర్జీ పార్టీ. ఒకేసారి ఇటు బీజేపీతోనూ ఇటు కాంగ్రెస్‌తోనూ ఆమె పోరాటం చేశారు. మరి ఈ పోరాటంలో మమత విజయం సాధిస్తారా ? లేదా ? అనేది చూడాల్సిందే.