గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల పంచాయితీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో ఎన్డీయే పక్షంగా, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిగా ఈ రెండు పార్టీలు ఎంతో సఖ్యతగా మెలుగుతున్నాయి. కానీ తెలంగాణ గడ్డపైకి వచ్చేసరికి మాత్రం ఈ రెండు పార్టీల తీరు తూర్పు, పడమరల్లా తయారైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పొత్తుల వ్యవహారం రాష్ట్ర అధ్యక్షుడి చేతుల్లో ఉండదని, అది తమ పార్టీ జాతీయ నాయకత్వం చూసుకునే అంశమని కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే, తాము కూడా వంద శాతం ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన అధికారికంగా ప్రకటించారు. దీంతో గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో జనసేనతో పొత్తుకు కమలనాథులు ససేమిరా అనడానికి ప్రధానంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యవహార శైలే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన పార్టీకి మొదటి నుంచి ఆంధ్రా పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. దీనికి తోడు ఇటీవల పవన్ కల్యాణ్.. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని రగిల్చాయి. పవన్ కామెంట్లకు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, బీఆర్ఎస్ నాయకుల నుంచి గట్టి కౌంటర్లు సైతం ఎదురయ్యాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జనసేనతో చేతులు కలిపితే పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ బీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన అంచనాకు వచ్చింది. జనసేన ద్వారా అదనంగా వచ్చే ఓట్ల సంగతి దేవుడెరుగు, ఉన్న సొంత ఓటు బ్యాంకు కూడా ఈ ఆంధ్ర ముద్రతో డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని కమలం నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఢిల్లీలోని తమ జాతీయ నాయకత్వానికి సైతం ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. పొత్తు వల్ల ఎదురయ్యే క్షేత్రస్థాయి ఇబ్బందులను అధిష్టానానికి వివరించిన తెలంగాణ నేతలు, ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను కలుపుకుపోయేది లేదని తెగేసి చెబుతున్నారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల కోసం జనసేన పార్టీ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలో ఉండటం, దానికి తోడు టీడీపీ, బీజేపీలతో కూటమిలో ఉండటం తమకు కలిసివస్తుందని అంచనా వేస్తోంది. ఈ బలాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్థిరపడిన సెటిలర్ల ఓట్లను సులభంగా రాబట్టుకోవచ్చని జనసేన ప్లాన్ చేస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే, ఆ పార్టీ ఇమేజ్ కూడా తోడై జీహెచ్ఎంసీలో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించవచ్చని ఆశిస్తోంది. అయితే ఇదే సమయంలో బీజేపీకి చెందిన కొందరు కిందిస్థాయి నాయకులు జనసేన కండువా కప్పుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీ నేతలను ఆకర్షిస్తున్న జనసేన తీరుపై కమలం పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రంలో, ఏపీలో దోస్తీ చేస్తున్న పార్టీలు తెలంగాణలో మాత్రం ఒకరి నాయకులను మరొకరు లాక్కుంటూ కుస్తీ పడుతుండటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. జనసేనకు క్షేత్ర స్థాయిలో సరైన నిర్మాణం లేకపోయినా, కేవలం పొత్తుల మీద ఆధారపడి రాజకీయం చేయాలని చూస్తోందని బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
జనసేన, బీజేపీల పొత్తుల లెక్కలు, సెటిలర్ల ఓట్ల వ్యూహాలను పసిగట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వారికి చెక్ పెట్టేలా ఒక మాస్టర్ స్ట్రోక్ ప్రయోగించారు. శివారు ప్రాంతాల్లోని సెటిలర్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించడం, కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సత్సంబంధాలు కొనసాగించడం, అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన అనుసరించిన తీరు.. ఇవన్నీ జనసేన ఆశలపై నీళ్లు చల్లాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాం తర్వాత, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని సెటిలర్లు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. యాంటీ కాంగ్రెస్ వైఖరితో ఉన్న ఆ ప్రాంత ప్రజల మనసు గెలుచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్‌తో, సెటిలర్ల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్న జనసేన ఆలోచనలకు పెద్ద బ్రేక్ పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జనసేనకు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాల్లో అభిమానులు, సానుభూతిపరులు ఉన్నప్పటికీ, దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునేంత బలమైన పార్టీ నిర్మాణం లేదు. ఒకవేళ బీజేపీ, జనసేనలు వేర్వేరుగా ఒంటరి పోరుకు దిగితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేనల మధ్య ఓట్లు చీలిపోవడం ఎవరికి లాభిస్తుందో కానీ, ఆయా పార్టీలను డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తెలంగాణలో తనను తాను ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా, ప్రత్యామ్నాయంగా నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ తరుణంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే, సొంత బలం లేక ఆంధ్ర రాజకీయాల అండ కోసం పాకులాడుతోందన్న అపవాదును బీజేపీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బలమైన అస్త్రంగా మారుతుందని కమలం నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే జీహెచ్ఎంసీతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒంటరి పోరు ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు పట్టుబడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, లేక పూర్తిగా విడిపోతారా అన్నది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి మాత్రమే స్పష్టత రానుంది.


