టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి అఫీషియల్ గా ఇంకా ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. అయితే.. ఇప్పుడు నాగ్ 101వ సినిమా కూడా ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. బయటకు వచ్చిన న్యూస్ మాత్రం అంత ఎగ్జైటింగ్ గా లేదని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. నాగ్ 100వ సినిమా గురించి అఫీషియల్ గా అప్ డేట్ వచ్చేది ఎప్పుడు..? నాగ్ 101వ సినిమా గురించి బయటకు వచ్చిన న్యూస్ ఏంటి..?
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఇంత వరుకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇటీవల లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జులై 10 తర్వాత 100వ సినిమా గురించి అప్ డేట్ ఇస్తానని చెప్పారు నాగార్జున. కింగ్ 100 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో.. నాగ్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని.. ఆడియన్స్ కి డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగిస్తుందనేది ఇన్ సైడ్ న్యూస్.
ఇప్పుడు నాగ్ 100వ సినిమా గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాకుండానే.. 101వ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో నాగార్జున 101వ సినిమా చేయబోతున్నారని.. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే.. ఈ న్యూస్ నాగ్ ఫ్యాన్స్‌ను అంతగా ఎగ్జైట్ చేయడం లేదు. అందుకు కారణం.. బొమ్మరిల్లు భాస్కర్ ట్రాక్ రికార్డే. బొమ్మరిల్లు మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేశాక భాస్కర్ ఆ స్థాయి సినిమా మళ్లీ తీయలేకపోయాడు. రెండో చిత్రం పరుగు బాగానే ఆడినా.. ఆతర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త, బెంగళూరు డేస్ రీమేక్ చిత్రాలతో మెప్పించలేకపోయాడు.
అక్కినేని అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ బాగానే ఉంది కానీ.. జస్ట్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఆతర్వాత తీసిన జాక్ డిజాస్టర్ అయ్యింది. అందుకనే ఇంత వరుకు బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్ కి నాగార్జున ఛాన్స్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. అభిమానులు ఏమో నాగార్జున మాస్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.. సక్సెస్ లో లేని క్లాస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో నాగ్ సినిమా చేయడం అవసరమా..? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో..? లేక గాసిప్ గానే మిగిలిపోతుందో చూడాలి.


