ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా వేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యూవల్ చేస్తామంటూ నమ్మించి భారీ మోసానికి నిందితులు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
వెస్ట్ ఇబ్రహీంపట్నంకి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బాధితుడు యూకే (UK)లో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండటంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్‌లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని వీరు నమ్మబలికారు. నిందితుల మాటలు నమ్మి బాధితుడు రూ. 15 లక్షల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు నిందితులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయానని బాధితుడు గ్రహించాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు
బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన , గుంటూరులో ఉండే మధుకర్ తండ్రి పై కేసు నమోదైంది. ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ఐ బి.రాజు వెల్లడించారు. ఈ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది మోసపోయి ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.


