లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహూతో ట్రంప్ ఫోన్ కాల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు Axios కథనం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నేతన్యాహు చర్యలతో ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చలు దెబ్బతింటాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక దశలో నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై మండిపడ్డారు. ఇప్పటికే నెతన్యాహుని అందరూ ద్వేషిస్తున్నారని.. ఇజ్రాయెల్‌పై కూడా వ్యతిరేకత పెరుగుతోందని ట్రంప్ వ్యాఖ్యనించినట్టు సమాచారం.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను నెతన్యాహూ కొంత భిన్నంగా వివరించారు. హెజ్బొల్లా దాడులు ఆపకపోతే బీరూట్‌లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయని ట్రంప్‌కు తాను స్పష్టం చేసినట్లు చెప్పారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు యథావిధిగా కొనసాగుతాయని కూడా ఆయన అన్నారు.


