తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు జోసెఫ్ విజయ్( C. Joseph Vijay) తన ప్రత్యేక పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజకీయాల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుని సీఎం కుర్చీ అధిష్టించిన విజయ్… ఇప్పుడు తన క్రమశిక్షణ, సమయపాలనతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రతి పనిలో ఆయన నిరాడంబర స్వభావం కనిపిస్తోంది.
మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్, అప్పటి నుంచి ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందుగానే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా వ్యవహరిస్తున్న ఆయన తీరు అధికారులను సైతం ఆకట్టుకుంటోంది.
ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, విజయ్ ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తీసుకువస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భోజన విరామ సమయంలో బయట కార్యక్రమాలకు వెళ్లకుండా, తన ఛాంబర్‌లోనే భోజనం ముగించి వెంటనే తిరిగి అధికారిక పనుల్లో నిమగ్నమవుతున్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సామాన్య జీవనశైలిని కొనసాగిస్తున్న విజయ్‌పై ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమయపాలన, క్రమశిక్షణతో వ్యవహరిస్తున్న ఆయన తీరు ప్రభుత్వ యంత్రాంగానికి కొత్త సందేశాన్ని ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే విజయ్ పని తీరుపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుండగా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


