కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) పోక్సో కేసు వ్యవహారంలో తన పేరును భవిష్యత్తులో ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా ప్రచారంలో ఉన్న వీడియోలు, పోస్టులను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా న్యాయస్థానాన్ని ఆయన కోరారు.
ఇక మరోవైపు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఫొటోలు, వీడియోలు, కుటుంబ వివరాలు బయటపెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు చర్యలకు దిగారు.
మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ (Child Welfare Committee) ఛైర్‌పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గోప్యతకు భంగం కలిగించే విధంగా సమాచారాన్ని ప్రచారం చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాధితుల వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు ప్రచారం చేయడం నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.


