దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎంపీ ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజానురంజక పాలన అందించే పాలకులను ప్రజలు నెత్తిన పెట్టుకుం టారు. ప్రజా కంఠక పాలన సాగిస్తే మాత్రం ఛీత్కార సత్కారాలతో సాగనంపుతారు. అందుకే, అధికారంలో ఉన్న పార్టీలు ఎంతో జాగురూకతతతో పాలన సాగించి ప్రజా అనుగ్రహానికి పాత్రులవ్వాలి. ప్రజల పై ఏ మాత్రం అలసత్వం వహించినా ఆయా పార్టీలకు వ్యతిరేక ఫలితాలే వస్తాయి. ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న చాలా పార్టీలకు ప్రజలు ఝలక్ ఇచ్చారు.
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలున్న పార్లమెంట్లో అధికారం చేపట్టాలంటే సాధారణ మెజార్టీ 272. బీజేపీ ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ ఇండియా కూటమి మధ్య హోరా హూరీ పోరు సాగింది. అధికారంలో ఉన్న ఎన్డీఏ 400 స్థానాలు పైబడి సాధిస్తుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే, ప్రజలు బీజేపీ ధీమాకు చెక్ పెట్టారు. గెలుపు అవకాశం ఇచ్చినా, అంతంత మాత్రం విజయ అవకాశాన్నే కల్పించారు. బీజేపీ సారధ్యంలో ఎన్డీఏ పక్షాలన్నీ ఏకపక్షంగా నిలిచినా 300 సీట్లు సాధించలేకపోయాయి. ఇండియా కూటమికి యాభై సీట్లు రావడం సైతం కష్టమని బీజేపీ నేతలు జోస్యం చెప్పగా, ఆ జోస్యాన్ని అపహాస్యం చేస్తూ దేశ ప్రజలు ఇండియా కూటమికి 250 వరకు సీట్లు కట్టబెట్టారు.
డెమోక్రసీ ఆఫ్ ది పీపుల్, బైదీ పీపులు, ఫర్ ది పీపుల్ఇంతటి శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజకు స్థానం లేదు. అధికార దర్పం, ధనమదాధికారాలకు తావు లేదు. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన పాలకులు ప్రజా కంఠకు లుగా పాల్పడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉచితానుచి తాలు ఆలోచించకుండా ఎన్నికల సమయంలో హామీలు గుప్పించేసి, అధికార పగ్గాలు చేపట్టాక ఆ హామీలను గాలికొదిలేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇక ప్రజాభీ ష్టానికి వ్యతిరేకంగా అనుచిత రీతిలో పాలన సాగించే పాలకులకు ప్రజా తిరస్కారం తప్పదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న చాలా పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది. పాలనా వైఫల్యాలే ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.ఆజ్ఞా పాలనే అధికారం. ప్రజాస్వామ్యంలో ప్రజాజ్ఞ వేదవాక్కు. సమాజంలో సహకారానికే అధికారం. అధికారం ఉందని దర్పం చూపి అహంకార వైఖరి ప్రదర్శిస్తే, ఆ అధికారాన్ని ప్రజలు కూకటివేళ్లతో పెకలించి వేస్తారు. సామాజిక అధికారాన్ని బెదిరింపులు, అధికార దుర్వినియోగిస్తే ఫలితం చేదుగానే ఉంటుంది.
దేశవ్యాప్తంగా జరిగిన పార్టమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 298, ఇండియా కూటమి 225, ఇతరులు 20 సీట్లు పొందాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీ ఏకంగా 303 సీట్లు పొందింది. ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా పాలనా పగ్గాలు చేపట్టే అవకాశమే బీజేపీకి నాడు వచ్చింది. దశబ్దకాలం అప్రతిహతం గా పాలన సాగించిన బీజేపీ ఇప్పుడు బొటాబొటీ మెజార్టీతో, ఎన్డీఏ పక్షాల ఆధారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. తమ పార్టీ ఒక్కటే 400 పైబడి సీట్లు సాధిస్తుందని, విజయం తమ చేరువలో ఉంటుందని, రాహుల్ గాంధీ వయస్సు ఎంతో అన్ని సీట్లు సైతం కాంగ్రెస్ కు రావని బీజేపీ పెద్దలు విమర్శలు చేశారు. బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్, అత్యుత్సాహానికి ఓటర్లు చెక్ పెడుతూ బొటాబొటి మెజార్టీతో గట్టెంకించారు. ఎన్డీలోని ఇతర పక్షాల సాయం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితి బీజేపీకి వచ్చి పడింది. హేర్ అండ్ ది టార్టాయిస్ కధ మాదిరి నెగ్గడానికి కావల్సిన అన్ని అర్హతలూ ఉన్నా వైరి పక్షం సామర్థ్యం ఎంత అనే రీతిలో ప్రవర్తించి తేలిగ్గా తీసుకోవడంతో కాంగ్రెస్, ఇండియా కూటమి ఓటమి పాలైనా బీజేపీ దూకుడుకు చెక్ పెట్టింది.
ఒడిశాలో అధికార పక్షం బీజేడీ. ఒకప్పుడు బీజేపీకి బీజేడీ మిత్రపక్షం. ఈ ఎలక్షన్లలో బీజేపీ, బీజేడీ మధ్య వైర వాతావరణం ఏర్పడింది. పాలనకు మంచితనానికి సంబంధం ఉండదు. సమర్థత, సంక్షేమం, అభివృద్ది, సుపరి పాలనను ప్రజలు కోరుకుంటారు. నవీన్ పట్నాయక్ కు మంచి నేత అని, సౌమ్య హృదయుడని పేరున్నా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులెత్తించడంలో ఆయన విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ ను ఆ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టి, బీజేపీకి పట్టం కట్టారు. దశబ్ద కాలంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ కు షాకిచ్చి బీజేపీకి పట్టం కట్టారు. ఆరోసారి సీఎం కావాలన్న పట్నాయిక్ ఆశలు అడియాశలయ్యాయి.
పాతికేళ్ల క్రితం ఒడిశా ఎలా ఉందో అదే మాదరి ఉందని, పొట్లాడి తెచ్చుకున్న ప్రాజెక్ట్ ల్లేవు, అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది. తలసరి ఆదాయం బాగా పడిపోయింది. ఒడిశా ఎన్నికల్లో అభివృద్ధి కీలకాంశం గా మారడం, ఆ అభివృద్ది చర్యల్లో చేపట్టడంలో నవీన్ పట్నాయక్ విఫలం తదితర కారణాలన్నీ ఒడిశా బీజేడీ సర్కారు ఓటమికి కారణమయ్యాయని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ తన హవా సాగించింది. ఒకప్పుడు మిత్రపక్షాలు, ఇప్పుడు శతృపక్షా లుగా ఉన్న బీజేపీ, బీజేడీ ఈ ఎన్నికల్లో పోటీ పడ్డాయి. అయితే, ఈ పరిస్థితిని తెలివిగా క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రచారం చేసి విజయం సాధించిం ది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న బీజేడీ, బీజేపీ ఇప్పుడు శతృత్వం నాటకమనో, మరోటనో ఫోకస్ చేయ గల్గితే ఒడిశాలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేదేమో అనే వార్తలు వినవస్తున్నాయి. వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు, పాతికేళ్లు సీఎంగా ఉన్నా అవినీతి మరక అంటని రాజకీయ నేత నవీన్ పట్నాయక్ అని బీజేపీ పెద్దలు కితాబు ఇస్తూనే, అభివృద్ధిలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈసారి తమకు అధికారం ఇస్తే ఒడిశాను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాన్నిచేస్తామన్నారు. ఈ కారణంగానో, మరెందుకో గాని ఒడిశా ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ అధికారం కోల్పోయింది. 2019లో 151 సీట్లలో గెలిచిన జగన్ పార్టీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యంత దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. వైసీపీ సర్కారు సంక్షేమంపై దృష్టి సారిం చినా అభివృద్ధిని పక్కన పెట్టడం మైనస్ పాయింట్ గా మారినట్టు తెలుస్తోంది. అధికార దర్పం ప్రదర్శించడం, అనుచిత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం, మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లినా, ఏ రాజధాని లేకుండా పోవడం తదితర ఎన్నో కారణాలు వైసీపీ కి ప్రతికూల అంశాలుగా మారాయి. ఇక్కడ, టీడీపీ, జనసేన, బీజేపీ జత కట్టి పోరుకు దిగడం, వైసీపీ ఒంటరిగానే పోరు సాగిం చడం సైతం వైసీపీ పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అవినీతి, కుంభ కోణాలమయంగా మారింది. అయితే, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటూ ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, కుంభ కోణాలకు తెరతీసిన ఆప్ ప్రభుత్వంపై ఢీల్లీ ఆప్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం చెందారు. కట్టలు తెంచు కున్న ప్రజల ఆగ్రహంతో ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకు పోయింది. దేశ రాజధానిలో మొత్తం ఏడు పార్ల మెంట్ సీట్లు ఉండగా ఒక్కటంటే ఒక్క సీటులో ఆప్ గెలవలేదు. ఇక్కడ మొత్తం స్థానాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే రీతిలో పంజాబ్ లో ఆప్ కేవలం మూడు సీట్లు గెల్చుకోగా కాంగ్రెస్ ఏడు సీట్లను పొందింది.
కాంగ్రెస్ కు పునర్ జీవితం కల్పించింది కర్నాటక. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుండగా ఆ పార్టీ కేవలం తొమ్మిది పార్లమెంటు సీట్లను మాత్రమే దక్కించుకుంది. బీజేపీ 17 స్థానాల్లో విజయం సాధించి ముందుస్థానంలో ఉంది. బీజేపీ మిత్ర పక్షం జేడీఎస్ రెండుస్థానాల్లో విజయం సాధించింది.ఇదే రీతిలో ఢిల్లీలో ఆప్, యూపీలో బీజేపీ మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పట్టుకోల్పోవడాలు, సీట్లు కోల్పోవడాలు జరిగాయి. ఇక దేశంలోనే అత్యధిక స్థానాలు, ఏకంగా 80 స్థానాలున్న యూపీలో బీజేపీ సర్కారు దశాబ్దకాలంగా హవా సాగిస్తోంది. బీజేపీ చేతిలో రాష్ట్ర సర్కారు ఉన్నా ఇక్కడ ఇబ్బందికర ఫలితాలు ఆ పార్టీకి వచ్చాయి. గతంతో పోలిస్తే సగానికి సగం స్థానాలు తగ్గిపో యాయి. ఇదే రీతిలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతికూల ఫలితాలు సాధించి ఢీలా పడ్డాయి.


