కాంగ్రెస్ పార్టీకి మొదటినుంచి దక్షిణాది అండగా నిలిచింది. 1978 నాటికి దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి. 1978లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దక్షిణాదిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అప్పట్లో ఇందిరా కాంగ్రెస్‌కు నైతిక బలాన్ని ఇచ్చింది. 1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. రెండు సంవత్సరాల కిందట దక్షిణాదికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు సాక్షాత్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి లభించడం విశేషం.
కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన ఇందిరా గాంధీ కుటుంబానికి మొదటినుంచి దక్షిణాదితో అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది కూడా దక్షిణాది ప్రాంతమే. ఎమర్జెన్సీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచాయి. ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. లోక్‌సభలో జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఒక ఏడాది తరువాత అంటే 1978లో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కర్ణాటకలో దేవరాజ్ అర్స్ నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతేకాదు… 1978లో కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు లోక్‌సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఇందిరా గాంధీ విజయం సాధించారు. చిక్‌మగ్‌ళూరు ఉప ఎన్నికలో జనతా పార్టీ అభ్యర్థి వీరేంద్ర పాటిల్‌పై ఇందిర గెలిచారు. దేశమంతా ఓటమితో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి చిక్‌మగ్‌ళూరు ఉప ఎన్నిక ఫలితం ఊరటనిచ్చింది. కాగా ఇందిరా గాంధీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉంది. 1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికలో రెండు లక్షల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఇక్కడో విశేషం ఉంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి కూడా ఇందిర విజయం సాధించారు. అయితే రాయ్‌బరేలి నియోజకవర్గానికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగానే ఇందిర కొనసాగారు.
ఇందిరా గాంధీ ప్రారంభించిన సంప్రదాయాన్ని ఆమె కోడలు సోనియా కూడా కొనసాగించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి సోనియా పోటీ చేశారు. బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్పటి బీజేపీ అభ్యర్థిని సుష్మా స్వరాజ్‌పై 56 వేల ఓట్ల మెజారిటీతో సోనియా గాంధీ గెలుపొందారు. దక్షిణాదిన పోటీ చేసే నాన్నమ్మ, తల్లి సంప్రదాయాలను రాహుల్ గాంధీ కూడా కొనసాగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాహుల్ గాంధీ. ఇవన్నీ ఇలా ఉంటే రెండు సంవత్సరాల కిందట దక్షిణాదికి చెందిన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు సాక్షాత్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి లభించడం విశేషం.ఈసారి ప్రధానంగా దక్షిణాదిపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాదిన గల ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అలాగే నాలుగు నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. కర్ణాటక, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 45 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. స్వంత ప్రభుత్వాలు ఉండటంతో కర్ణాటక, తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారాన్ని హెరెత్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు చక్రం తిప్పుతారో ఎవరికీ తెలియదు. ఇందిర హయాంలో ధావన్, ఫోతే దార్‌ల హవా నడిచింది. ధావన్ లేదా ఫోతేదార్ ఓకే అంటే, ఇందిర ఓకే అన్నట్లు అప్పట్లో లెక్క. ఆ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీలో ధావన్, ఫోతేదార్‌ల హవా నడిచింది. రాజీవ్ హయాంలో అరుణ్ నెహ్రూతోపాటు ఒకరిద్దరి హవా నడిచింది. ఇక సీన్ కట్ చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్‌లో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది .ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది కేసీ వేణుగోపాల్ గురించి. కేసీ వేణుగోపాల్ దక్షిణాదినగల కేరళ నుంచి ఎదిగొచ్చిన నేత. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తరువాత ముఖ్య మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై ప్రతిష్టంభన నెలకొంది. సిద్దరామయ్య వర్సెస్ డీకే శివ కుమార్ అన్నట్లు కొన్నిరోజులు యుద్ధం నడిచింది. అయితే చివరకు డీకే శివకుమార్ మెత్తపడ్డారు. హైకమాండ్ తరఫున డీకే శివకుమార్‌ను సముదాయించడంలో కేసీ వేణుగోపాలే కీలక పాత్ర పోషించా రంటారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీలోని మరో కీలక నేత జైరాంరమేశ్ కూడా దక్షిణాదికి చెందిన నాయకుడు. కర్ణాటక నుంచి వచ్చిన ఈ నాయకుడు అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎది గారు.
ఇదిలా ఉంటే, 2022లో జరిగిన ఏఐసీసీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే కూడా దక్షిణాది నాయకుడే. కన్నడనేలకు చెందిన మల్లికార్జున్ ఖర్గే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. కర్ణాటక సరిహద్దులు దాటారు. జాతీయస్థాయికి ఎదిగారు. కేంద్రమంత్రిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అంతిమంగా అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి ఓ ట్విస్టుంది. మల్లికార్జున్ ఖర్గే పై కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన శశి ధరూర్ కూడా దక్షిణాది నాయకుడే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నుంచి శశి ధరూర్ పోటీ చేశారు. మొత్తంమీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో దక్షిణాది నాయకుల హవా నడుస్తోంది.


