టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. నిన్నటివరకూ మూడు ర్యాలీలు, నాలుగు రోడ్ షోలు, ఆరు బహిరంగ సభలు అన్నట్లు సాగిన ప్రచారం, ప్రత్యర్థుల మీద ఎదురులేని దాడితో సిద్ధమ వుతోంది. కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన మీద విరుచుకుపడింది. మోదీ సర్కార్ అక్రమా లను ఎండగడుతూ.. టీ కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. ఇంతకీ చార్జిషీట్ లో అంశాలేంటి. ? చార్జిషీట్ కాంగ్రెస్ విజయావకాశాలకు ఏమేరకు ప్లస్ అవుతుంది.?
కేంద్రంలో పదేళ్ల భారతీయ జనతా పార్టీ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ చార్జ్‌షీట్ విడుదల చేసింది. నయవంచన – పదేళ్ల మోసం – వందేళ్ల విధ్వంసం అనే పేరుతో కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన చార్జ్‌షీట్‌ను గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 14 ఉప శీర్షికలున్న ఈ చార్జ్‌షీట్ ప్రధాని నరేంద్ర మోడీ పాలనను దుయ్యబట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు, హస్తం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ పేరుతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బీజేపీ మొదట్నంచీ అలసత్వంతో వ్యవహరించిందని చార్జ్‌షీట్‌లో బీజేపీ ఆరోపించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విడుదల చేసిన కాకినాడ డిక్లరేషన్‌ను ఈ సందర్భంగా కాంగ్రెస్ చార్జ్‌షీట్ ప్రస్తావించింది. అయితే కాకినాడ డిక్లరేషన్‌ను బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా పార్లమెంటు వేదికగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును కమలం పార్టీ ఎగతాళి చేసింది మండిపడింది హస్తం పార్టీ. పదేళ్ల బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లోనే ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల పరిధిలోని 211 గ్రామాలను బలవంతంగా ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేసిందని నరేంద్ర మోడీ సర్కార్‌పై మండిపడింది హస్తం పార్టీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్బంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హమీని ఇప్పటివరకు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని హస్తం పార్టీ నిప్పులు చెరిగింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ సంగతిని కేంద్ర ప్రభుత్వం మరచిపోయిందని చార్జ్‌షీట్ దుయ్యబట్టింది. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని గాలికొదిలేసిందని మండిపడింది. అలాగే 2400 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టింది. తెలంగాణను ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పన్నుల రాబడిలో తెలంగాణ వాటాను 27 శాతానికి తగ్గించిందని చార్జ్‌షీట్ ఆరోపించింది. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూపాయి పంపితే కేవలం 43 పైసలు మాత్రమే తిరిగి ఇస్తుందని ఆరోపించింది హస్తం పార్టీ. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్‌కు భారీ ఎత్తున నగదును తిరిగి చెల్లిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ.
జీఎస్టీ పరిహారం కింద తెలంగాణకు రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయలను ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం విడుదల చేయలేదని చార్జ్‌షీట్ ఆరోపించింది. అలాగే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన రూ. 24,205 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు రూ. 1,800 కోట్లను నరేంద్ర మోడీ సర్కార్ ఇంకా పెండింగ్‌లో పెట్టిందని హస్తం పార్టీ దుయ్యబట్టింది. నీటి విషయంలో కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఘాటు ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నీటిని విడుదల చేయడంలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంతేకాదు తెలంగాణ నుంచి ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌కు కూడా ఇప్పటివరకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వలేదని దుయ్యబట్టింది చార్జ్‌షీట్.
తెలంగాణకు సంబంధించి అనేక ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వరంగల్, నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లు, ఫ్యాబ్ సిటీ, సీలేరు పవర్ ప్రాజెక్ట్ అంశాలను కేంద్రప్రభుత్వం చెత్త బుట్టలో పడేసిందని ఆరోపించింది హస్తం పార్టీ. అలాగే నారాయణపేట చేనేత పార్క్, ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్దరణ అంశాలను కూడా నరేంద్ర మోడీ సర్కార్ గాలికొదిలేసిందని మండి పడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయా లు, సైనిక స్కూల్స్ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వ అటకెక్కించింది. వీటన్నిటితో పాటు విద్యావంతులు అనేక ఆశలు పెట్టుకున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం అంశాన్ని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసిందని చార్జ్‌షీట్‌లో ఆరోపించింది హస్తం పార్టీ. ములుగు గిరిజన విశ్వవిద్యాలయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ఇప్పటివరకు ములుగు ట్రైబల్ యూనివర్శిటీకి ఇప్పటివరకు రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని ఆరోపించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే ప్రస్తావించే నిజామాబాద్ పసుపు బోర్డుకు కూడా నిధులు ఇవ్వలేదని మండిపడింది. అంతేకాదు జాతరల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని చార్జ్‌షీట్ దుయ్యబట్టింది. కుంభమేళాకు వంద కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని సమ్మక్క- సారలమ్మ జాతరకు కేవలం రూ. 1.34 కోట్లు కేటాయించిందని చార్జ్‌షీట్ పేర్కొంది.అప్పులు చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవరకు మొత్తం 67 ఏళ్లలో అందరు ప్రధానులు కలిసి రూ. 55 లక్షల కోట్ల అప్పు చేశారని పేర్కొంది. కాగా నరేంద్ర మోడీ సర్కార్ పదేళ్ల కాలంలో రూ. 113 లక్షల కోట్లు అప్పు చేసిందని చార్జ్‌షీట్ ఆరోపించింది. నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ అప్పుల్లో దూసుకుపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ప్రభు త్వాలు ..భారీ ఎత్తున సంపద సృష్టిస్తే, బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అయినకాడికి తెగనమ్మతోందని ఆరోపించింది హస్తం పార్టీ.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేసే విధంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి, కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఓబీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు 75 శాతానికి చేరతాయన్నారు. అయితే రిజర్వేష న్లను రద్దు చేయాలని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ పాలనలో పేదల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయ న్నారు. చేనేత వస్త్రాల నుంచి కుటీర పరిశ్రమల వరకు జీఎస్టీని ఎడాపెడా పెంచిందని కేంద్రంపై మండి పడ్డారు రేవంత్ రెడ్డి. జీఎస్టీ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం దోచుకుంటోందని దుయ్య బట్టారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా తాము అధికారంలోకి వస్తే, ప్రజలకు చేసే మంచి పనులను వివరిస్తూ ఇప్పటికే పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీ పేరుతో మానిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. తమకు గతంలో కలసి వచ్చిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది.


