మావోయిస్టు వ్యవస్థ పతనమే లక్ష్యంగా కేంద్రం ఉక్కపాదం మోపుతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతోంది. వేల కోట్ల నిధులను వెచ్చిస్తోంది. స్పెషల్ ప్యాకేజ్లు విడుదల చేస్తోంది. ప్రజలు మావో యిస్టు భావాలకు ఆకర్షితులవ కుండా జాగ్రత్తపడుతోంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అణువ ణువు గాలిస్తోంది. అడవిని జల్లెడ పడుతూ మావోయి స్టులపై తుపాకీ తుటాల వర్షం కురిపి స్తోంది.
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. గత ఐదేళ్లలో.. ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర బలగాలను పంపడంతోపాటు.. మారు మూల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, తద్వారా ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒకప్పుడు ఆరేడు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో తీవ్రంగాను.. మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్లలో కొంతమేర ప్రభావం కనిపిస్తోంది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కేంద్ర బలగాలను పంపుతోంది.
గత నాలుగు నెలల కాలంలో ఛత్తీస్గఢ్లో 80 మంది మావోయిస్టులు మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బలగాలను పంపడంతోనే సరిపెట్టకుండా కేంద్రం వివిధ పథకాల కింద మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. 2018-19 నుంచి 2022-23 వరకు.. అంటే ఐదేళ్ల కాలంలో కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు రూ.4,931 కోట్లు మంజూరు చేసింది. దీనికితోడు బలగాలను క్షేత్రస్థాయికి తరలించేందుకు, గాయపడినవారిని చికిత్స కోసం తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ల ఖర్చుల కింద మరో రూ.765 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ ఇటీవల రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ఈ నిధుల్లో సింహభాగం వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీం, సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వంటి పథకాల కింద నిధులు మంజూరు చేస్తోంది. ఈ నిధులను పోలీస్స్టేషన్ల నిర్మాణం, పోలీసు వాహనాలు, అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు మొదలుకొని మారుమూల ప్రాంతా ల్లో అభివృద్ధి పనులకు కూడా వెచ్చించవచ్చు.
ఈ ఐదేళ్లలో ప్రభావిత ప్రాంతాల్లో 13,630 కిలోమీటర్ల మేర రహదారులు, 13,823 సెల్ఫోన్ టవర్లు కొత్తగా నిర్మించారు. సరైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని, తద్వారా మారు మూల ప్రాంతాల ప్రజలు మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లకుండా చూడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తు న్నాయి. 2010లో 96 జిల్లాల్లోని 465 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న మావోయిస్టు కార్యకలాపాలు 2023 నాటికి 42 జిల్లాలు, 171 పోలీస్స్టేషన్లకు పరిమితం అయ్యాయి. ఈ మేరకు ఓవైపు భద్రతా బలగాలతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు అభివృద్ధితో ప్రజలకు దగ్గర అవడం ద్వారా వామపక్ష తీవ్రవాదంపై పట్టు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది.


