అసెంబ్లీ ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడిచాయి. పార్లమెంట్ ఎలక్షన్స్‌లోనూ కామ్రేడ్స్‌తో చేయి కలిపింది హస్తం. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటున్న వేళ ఓట్లు చీలితే తమకు ప్రమాద ముందని భావించిన కాంగ్రెస్ పార్టీ.. లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండటంతో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తు న్నాయి ప్రధాన పార్టీలు. ఇందులో భాగంగానే సీపీఎంతో పొత్తుకు సై అంటోంది కాంగ్రెస్. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి పొత్తుల కోసం ఎదురుచూసిన కామ్రేడ్లు హస్తం నేతల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో తమకు బలమున్న స్థానాల్లో పోటీకి దిగారు. అయితే తమ చిరకాల రాజకీయ శత్రువైన బీజేపీని ఎదుర్కొనేందుకు సీపీఎం మద్దతు అవసరమని భావించిన కాంగ్రెస్ ఆ దిశగా మంతనాలు నడిపింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ముఖ్య నేతలు పొత్తులపై చర్చించారు. ఈ భేటీలో భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. అయితే,.. భువనగిరి స్థానాంలో మాత్రం షరతులు విధించినట్టు సమాచారం.
భువనగిరి స్థానాన్ని కాంగ్రెస్‌ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్మినేనితో చర్చలు జరిపారు. అయితే ఇక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దింపిన సీపీఎం ప్రచారంలోనూ స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే భువనగిరి సీటుపై షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరిసహా మిగిలిన స్థానాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు కోరారని, ఇందుకు తాము అంగీకరించలేదని తెలిపారు తమ్మినేని. భువనగిరి సీటు విషయంలో సందిగ్ధం ఉన్నప్పటికీ, మిగిలిన 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. ఒకట్రెండు విషయాల్లో సందిగ్ధత ఉన్నా, ఏకాభిప్రాయానికి వస్తామని, సీపీఎం సహకారంతో భవిషత్తులో ముందుకు సాగుతామని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సీపీఎం నేతలతో పొత్తు చర్చలు జరిపినట్టు తెలిపిన ఆయన ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామ్రేడ్స్‌తో పొత్తులతో వెళ్లిన కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంతో పొత్తు చర్చలు జరిపింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలతో చర్చలు జరిపగా తాజాగా మరోసారి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సీపీఎం నేతలతో మంతనాలు జరిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులతో వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పొత్తు ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకూ వేచి చూడాల్సిందే.


