ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. వచ్చేనెల 13న జరగనున్న ఈ ఎలక్షన్లలో గెలుపు కోసం అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో నియోజకవర్గానికి వ్యూహ ప్రతివ్యూహా ల్ని సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి ఆయా పార్టీలు. ఇక, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎంపీ స్థానంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఎంపీ స్థానం హిందూపురం. 1957లో ఏర్పాటైన ఈ పార్లమెంటు స్థానం మొదట్లో పెనుకొండ లోక్ సభా స్థానంగా ఉండేది. అదే పేరుతో 1952లో మొట్టమొదటి లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అయితే… 1957 నుంచి ఈ పేరు మారి హిందూపురం పేరుతో పార్లమెంటు స్థానం ఏర్పాటైంది. హిందూపురం పార్లమెంటు స్థానం ఏర్పడిన మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచింది. 1957, 1962లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన కేవి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. అనంతరం 1967లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు నీలం సంజీవరెడ్డి. ఆ తర్వాత 1971, 1977, 1980లో బాయపరెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 1984లో కె. రామచంద్రారెడ్డి విజయం సాధించగా.. 1989, 1991లో సానిపల్లి గంగాధర వరుసగా రెండుసార్లు తిరుగులేని విధంగా విజయం సాధించారు. అయితే.. 1996లో మాత్రం పరిస్థితి మారిపోయింది. తొలిసారిగా టీడీపీ ఈ స్థానం నుంచి గెలుపొందింది. 1996లో ఎస్ రామచంద్రారెడ్డి విక్టరీ కొట్టారు. అనంతరం మళ్లీ 1998లో సానిపల్లి గంగాధర కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సత్తా చాటారు. అనంతరం 1999లో టీడీపీ మళ్లీ పాగా వేసింది. బీకే పార్థసారథి టీడీపీ నుంచి గెలుపొందారు. 2004లో నిజాముద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. ఆ తర్వాత 2009, 2014లో మళ్లీ తెలుగుదేశం హవా వీచింది. నిమ్మల కిష్టప్ప రెండుసార్లు వరుసగా విక్టరీ కొట్టారు.
ఇక హోరాహోరీగా సాగిన 2019 ఎన్నికలకు వచ్చే సరికి సీన్ మారిపోయింది. టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప మరోసారి బరిలో దిగగా.. వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ పోటీ చేసారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పోటీలో వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ లక్షా నలభై వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా హిందూపురం పార్లమెంటు స్థానంలో వైసీపీ జెండా ఎగురవేశారు. జనరల్ స్థానంగా ఉన్న హిందూపురం పార్లమెంటు సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయి. హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్‌సభా స్థానం పరిధిలోకి వస్తాయి. ఇందులో రాప్తాడు అసెంబ్లీ స్థానం అనంతపురం జిల్లాలో ఉండగా.. మిగిలిన నియోజకవర్గాలన్నీ శ్రీ సత్యసాయి జిల్లా కింద వచ్చాయి. హిందూపురం పార్లమెంటు పరిధిలో తాజా లెక్కల ప్రకారం 16 లక్షల 41 వేలా 717 మంది ఓటర్లున్నారు. ఇందులు పురుషులు 8 లక్షలా 20 వేల 254 మంది ఉండగా.. మహిళలు 8 లక్షలా 21 వేలా 387 మంది, ట్రాన్స్ జెండర్లు 76 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసి అమలు చేస్తుండడంతో 2024 ఎన్నికల్లో గెలిచేది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది.


