తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్ 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగు పెట్టింది. 2001, ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి చరిత్ర పుటల్లోకెక్కింది. 10 ఏళ్లపాటు తెలంగాణను పాలించి తిరుగులేని చక్రవర్తిలా కేసీఆర్ కీర్తిని గడించారు. అయితే ఆ పరిస్థితులన్నీ తారుమారై ప్రస్తుతం ఉనికి కోల్పోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోంది బీఆర్‌ఎస్. ఈ పరిణామాలతో గులాబీ బాస్ మరోసారి ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటాలని కంకణం కట్టుకుని బస్సుయాత్రలతో సుడిగాలి పర్యటనలు చేస్తూ బిజీ అయ్యారు. మరి గులాబీ దళం ఆశిస్తున్నట్టు పార్టీకి పుర్వవైభవాన్ని వస్తుందా..? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా..? గులాబీ వనం మునుపటిలా కళకళలాడుతుందా..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలతో రాష్ట్ర సాధనకు పిడికిలి బిగించిన కేసీఆర్.. 2001, ఏప్రిల్ 27న పార్టీని స్థాపించి నీళ్లు, నిధులు, నిమాయకాల నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిల్చారు. రాష్ట్ర ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేశారు. పదేళ్ల బాలుడు మొదలుకొని.. పండుముసలి సైతం జై తెలంగాణ నినాదానికి గొంతు కలిపారు. తెలంగాణ వాసులంతా గులాబీ జెండాను భుజాన మోస్తూ కేసీఆర్ వెంట నడిచారు. అయితే 23 ఏళ్ల బీఆర్‌ఎస్ పయనం అంతసాఫీగా సాగలేదు. ఎప్పటికప్పుడు ఉనికి పోరాటం చేసింది. మొదట్లో తెలంగాణ ఉద్యమ పార్టీపై ప్రజల్లో అంత నమ్మకం లేదు. దీంతో పొత్తలు పెట్టుకుని రాజకీయ ఉనికిని చాటుకుంటూ రాజీనామాలు చేస్తూ ఉపఎన్నికల ద్వారా ఉద్యమ వేడిని పెంచుకుంటూ వచ్చారు కేసీఆర్. 2009 ఎన్నికల తర్వాత ఇక పార్టీ పరిస్థితి అయిపోయిందేమో అనుకున్నారు. పార్టీ నేతలంతా వరుస కట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ మాయలో పడిపోయారు. పార్టీ కార్యాలయాన్ని కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకుంటారే మోనన్న ఆందోళనతో కేసీఆర్ అందులోనే ఓ రాత్రి పడుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అలాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఒక్క సారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆమరణ నిరాహరదీక్ష ప్రారంభించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. మొత్తానికి 14 ఏళ్లపాటు అవిశ్రాంత పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైంది. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీపికబురును అందించింది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాటు పాలన సాగించింది. ఈక్రమంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఓవైపు పాలన సాగిస్తూనే మరోవైపు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కేసీఆర్. అందుకే అప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర సమతి టీఆర్‌ఎస్‌గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ కార్యాలయాలు సైతం ప్రారంభించారు. ఢిల్లీలోనూ బీఆర్‌ఎస్ భవనాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా ఇటు తెలంగాణలో ఓటమితో దేశ రాజకీయాలకు బ్రేక్ పడింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో పరిస్థితి తారుమారైంది. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్న చందంగా తయారైంది బీఆర్‌ఎస్ పరిస్థితి. పదేళ్లపాటు అధికారంలో కేసీఆర్ వెంట ఉన్న నేతలంతా అధికారం కోల్పోయేసరికి వలస బాట పట్టారు. కాంగ్రెస్, బీజేపీల గూటికి చేరుకోవడంతో కారు ఖాళీ అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తమ ఉనికిని కాపాడుకునే దుస్థితి ఎదురైంది. హస్తం, కమలం ఆరోపిస్తున్నట్టు ఒకటో రెండో సీట్లు వస్తే పార్టీ పని అయిపోయినట్టే. ఇది గ్రహంచిన కేసీఆర్ ప్రజాబాట పట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఉందని నిరూపించే వ్యూహంలో ఉన్నారు. అయితే,.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం అనుకున్నంత ఈజీ ఏం కాదు. మోదీ చరిష్మాతో బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగింది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుని తమ సత్తాను చాటింది. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఫుల్ జోష్‌లో ఉంది. ఇలాంటి పరిణామాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కొని బీఆర్‌ఎస్ నిలబడటం అంత సులువేంకాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రస్తుతం బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసీఆర్ ఎన్నడూ లేనన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉన్నారు. మరోపక్క నమ్మకస్తులైన నాయకులంతా పార్టీని వీడి ప్రత్యర్థితో జత కట్టారు. ఇలాంటి పరిణామాల్లో వ్యక్తిగత ఇమేజ్ లేని అభ్యర్థుల్ని నిలబెట్టి పార్టీ బలం మీద గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతగా సహకరించడం లేదు. ఇటీవల తుంటి ఎముక విరగడంతో నిలబడి ప్రసంగించే పరిస్థితి లేదు. అయినప్పటికీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు, క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రజాబాట పట్టారు. బస్సుయాత్రలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ కనీసం 5 సీట్లు గెలిచినా క్యాడర్‌లో భరోసా ఉంటుందని, అలా కాకుండా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైతే ఇప్పుడున్న నేతలుసైతం చేజారే పరిస్థితి ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. అందుకు బీజేపీ, కాంగ్రెస్ కాచుకుని మరీ రెడీగా ఉన్నాయి. అయితే,.. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం తమదే పైచేయి అంటున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ప్రజలకు అర్థమైందని, 10 ఏళ్ల పాలనలో మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో తమకే అధిక సీట్లు వస్తాయన్న భరోసాలో ఉన్నారు. మరి రాజకీయ చతురత, అపార అనుభవం కలిగిన కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా..? బీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేక ఉందా..? ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తారా..? పూర్వవైభవంతో గులాబీ వనం కళకళలాడుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


