టీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. నిన్నటివరకూ మూడు ర్యాలీలు, నాలుగు రోడ్ షోలు, ఆరు బహిరంగ సభలు అన్నట్లు సాగిన ప్రచారం.. ప్రత్యర్థుల మీద ఎదురులేని దాడితో సిద్ధమవుతోంది. కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన మీద విరుచుకుపడింది. మోదీ సర్కార్ అక్రమా లను ఎండగడుతూ.. టీ కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేసింది. ఇంతకీ చార్జిషీట్ లో అంశాలేంటి..? చార్జిషీట్ కాంగ్రెస్ విజయావకాశాలకు ఏమేరకు ప్లస్ అవుతుంది.?
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.. ఇచ్చిన హామీలను. గండికొట్టిన నిధులవివరాలను, అమలు చేయని అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ” నయవంచన… పదేళ్ల మోసం – వందేండ్ల విధ్వంసం” పేరుతో కాంగ్రెస్ బీజేపీపై చార్జిషీట్ ను ప్రకటించింది. గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు, సీనియర్ నాయకులు చార్జిషీట్ ను ఆవిష్కరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీని గద్దె దించాలని టీపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ పేర్కొన్నారు.
భారత దేశం స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి 2014లో మోడీ ప్రధాని అయ్యే వరకు.. మొత్తం 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు ఉంటే.. పదేళ్ళలో మోడీ సర్కార్ 113 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ సర్కార్. అప్పుల్లో దూసుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో 60 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టిస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థల పరం చేశారని ఆరోపించారు.ఎస్సీ ఎస్టీ ఓబీసీ ల రిజర్వేషన్ రద్దు చేసేవిధంగా ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేస్తోందని ఆ వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన నయవంచన, మోసం. ప్రజలకు వివరించేందుకు చార్జిషీట్ విడుదల చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరిస్తూ ఇప్పటికే పంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీ లతో మానిఫెస్టో లో ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమకు కలసి వచ్చిన పాత వ్యూహాలనే కాంగ్రెస్ నమ్ముకుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ విద్య.. వైద్యం.. నీటి పారుదల.. విద్యుత్ లాంటి చార్జిషీట్ లను గత తెలంగాణ సర్కార్ మీద ప్రయోగించి మంచి ఫలితాలు పొందిన కాంగ్రెస్. అదే వ్యూహాలను నమ్ముకొని పదేళ్ళ బీజేపీ విధానాలను ఎండగడుతూ.. ఇండియా కూటమి విధానాలను ప్రచారం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలని టీ కాంగ్రెస్ చూస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా.. పార్టీ విజయావకాశాలకు దోహదం చేస్తుందా.. అన్నది తెలియాలంటే జూన్ 4వ తేదీన వరకు వేచి చూడాల్సిందే.!


