తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సవాళ్లకు ప్రతిసవాళ్లు చేసుకుంటూ రాష్ట్రాన్ని రణక్షేత్రంగా మార్చేస్తున్నారు నేతలు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై ఓల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. అగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారి తీసింది. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి గన్‌పార్కు వద్దకు వచ్చానని..ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తే..తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే..రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని చాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. అయితే హరీష్‌రావు సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీశ్ రావు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటూఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు 2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు హరీష్‌రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీశ్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీశ్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీశ్‌రావు ఒకటిన్నర పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్‌రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు.


