మండుటెండల్లో కూడా లోక్ సభ ఎన్నికలు రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా, ముమ్మరంగా సాగింది. పోలింగ్ ముగిసింది. మొత్తం మీద 64 శాతం ఓట్లు పోలయినట్లు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియలేదు . త్రిపురలో ఎండను లెక్క చేయకుండా అత్యధికంగా ఓటర్లు నియోజకవర్గాలకు వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. త్రిపురలో 70 శాతం మించి పోలింగ్ జరిగింది.
13 రాష్ట్రాల్లో 88 నియోజకవర్గాల్లో చురుగ్గా పోలింగ్ సాగుతోంది. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకూ, కర్ణాటక లోని 14 నియోజకవర్గాలకూ రాజస్థాన్ లోని 13 నియోజకవర్గాలకూ నేడు రెండో దశలో పోలింగ్ జరిగింది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసిన ట్లే. ఇక మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ లో 8 నియోజకవర్గాలకు మధ్యప్రదేశ్ లో ఆరు, అసోం, బీహార్ లో ఐదేసి స్థానాలకు, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్ లో మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి త్రిపుర, జమ్మూకశ్మీర్ లోని ఒక్కో నియోజక వర్గంలోనూ నేడు ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ లోని బేతుల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మృతి కారణంగా నేడు జరగాల్సిన పోలింగ్ వాయిదా పడింది. మూడో దశలో మే 7న ఈ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహిస్తారు. మణిపూర్ లోని ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో సగం పోలింగ్ కేంద్రాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. మరో సగం పోలింగ్ కేంద్రాలకు ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగింది.
నేడు ఎన్నిక ఎదుర్కొన్న ప్రముఖ అభ్యర్థుల్లో కేరళ వయినాడ్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ., కర్ణాటక మాండ్య నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి, బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్య, ఉత్తరప్రదేశ్ లో సినీనటి హేమమాలిని, టీవినటుడు అరుణ్ గోవిల్, రాజస్థాన్ కోట లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ స్పీకర్ డికె శివకుమార్ తమ్ముడు డికె సురేశ్, తిరువనంత పురం లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత శశి ధరూర్ వంటి వారు ఉన్నారు.
బెంగళూరు లో ఓటు వేసే వారికోసం పలు హోటళ్ల వారు పబ్ లు, టాక్సీ డ్రైవర్లు ప్రోత్సాహకాలు ఆఫర్ చేయడం విశేషం.. ఓటు వేసిన వారికి పలు టాక్సీల వారు ఉచితంగా తిరిగి గమ్యస్థానాలకు చేరుస్తుంటే.. హోటళ్ల వారు ఓటు వేసినట్లు వేలు చూపితే.. ఉచితంగా దోశ, ఇడ్లీ వంటి టిఫెన్స్ అందిస్తున్నారు. కొన్ని పబ్ ల వారు బీర్ పై డిస్కౌంట్ ఇస్తున్నారు.


