లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి బిగ్ బూస్ట్ లభించనట్లైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సీనియర్ నటి, ఎంపీ సుమలత అంబరీష్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులు, నియోజ కవర్గ సహచరులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బీజేపీకి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది. దీంతో సుమలత సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మాండ్య బీజేపీ-జేడీఎస్ అభ్యర్థి కుమార స్వామికి ఆమె మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన మాండ్య నియోజకవర్గాన్ని ఎన్నటికి మరువనని సుమలత అన్నారు. నిత్యం ప్రజల సేవ కోసం తన ఇంటి తలుపులు ఎప్పటికే తెరిచే ఉంటాయని సుమలత స్పష్టం చేశారు.


