ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంటంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడు పెంచారు. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసిన చంద్రబాబు.. తాజాగా.. రెండో జాబితాను రిలీజ్ చేశారు. ఈసారి మొత్తం 34 మందికి అవకాశం కల్పించారు. ఈ జాబితాలో దాదాపుగా ప్రస్తుత ఇంఛార్జ్‌లకు ఛాన్స్ ఇచ్చినా.. కొన్ని నియో జకవర్గాల్లో అనూహ్యంగా సీనియర్ నేతలకు కాకుండా వారసులకు టికెట్లు కేటాయించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితా విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ..తాజాగా సెకెండ్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. రెండు జాబితాలు కలిపి చూస్తే ఇప్పటి వరకు మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థు లను ప్రకటించాల్సి ఉంది. పొత్తు సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరో సారి చింతమనేని ప్రభాకర్ కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఇక గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డిని పోటీ చేయనున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి టికెట్ దక్కించు కున్నారు.
మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో కూడా సీనియర్లకు చోటు దక్కలేదు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావుకు సెకెండ్ లిస్ట్‌లోనూ నిరాశ తప్పలేదు. అలాగే మాజీ మంత్రి జవహర్, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి పేర్లు సైతం తాజా జాబితాలో కనిపించలేదు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానాన్ని కోరుతుండ గా.. చంద్రబాబు మాత్రం చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందుకు గంటా సమ్మతించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబును గంటా కలిశారు. ఆయన విశాఖ జిల్లా నుంచే పోటీ చేస్తానని పట్టుపట్టడంతో ఈ సీటుపై క్లారిటీ రావటం లేదు.
ఇదిలా ఉంటే విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ సీటును జనసేనకు కేటాయించడం తో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టిక్కెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించారు. అటు పెందుర్తి సీటు పంచకర్లకు కేటాయించారన్న ప్రచారంతో బండారు వర్గీయుల ఆందోళన బాట పట్టారు. మొత్తానికి టీడీపీ సెకెండ్ లిస్ట్ విడుదల కావడంతో సీనియర్లలో అలజడి మొదలైంది. ఇంకా టిడిపిలో కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ను ప్రకటించాల్సి ఉండడంతో.. ఆశావహుల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో వేచి చూడాలి.


