హైదరాబాద్ లో నివసించే పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నారు. ఈ మేరకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. నాలుగు శాతం మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. జల్‌పల్లి మునిసిపల్ పరిధిలోని ఎర్రకుంటలో వలస కార్మికుల పిల్లల కోసం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో ప్రీ ప్రైమరీ కమ్ బ్రిడ్జ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. స్కూల్‌ను సీడ్ USA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్ హుస్సేనీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అభ్యసించేందుకు పిల్లలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సిటీలోని మురికివాడల్లో సర్వే నిర్వహించినట్లు ఈ సందర్బంగా హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తబా హసన్ అస్కారీ తెలిపారు.
హకీంపేట, ఎండీ లైన్లు, రాజేంద్రనగర్, కిషన్‌బాగ్, ఖ్యామ్‌నగర్, హసానగర్, కాలాపత్తర్, ఎర్రకుంట, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్, జల్‌పల్లి వంటి 15 పైగా ప్రధాన మురికివాడల్లోని బలహీన వర్గాల పిల్లల విద్యా స్థితిపై సంస్థ సర్వే చేసింది. మూడు నెలల వ్యవధిలో 2500 కుటుంబాలను ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో పేద మైనారిటీ పిల్లల్లో 27 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నట్లు తేలిందని ముజ్తబా హసన్ అస్కారీ చెప్పారు. పట్టణ మురికివాడల్లోని 756 ప్రభుత్వ పాఠశాలలను మ్యాప్ చేశామన్నారు. గత విద్యా సంవ త్సరంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో 50 శాతం మంది బడి మానేశారని వివరించారు. డ్రాపౌట్ పిల్లల తల్లిదండ్రులలో దాదాపు 65 శాతం మంది మహారాష్ట్ర, కర్నాటక, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారేనని హసన్ అస్కారీ చెప్పారు.