పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత కొన్ని నెలలుగా సహజీవనం చేసి, చివరకు తాళి కట్టే సమయానికి ఓ యువకుడు పలాయనం చిత్తగించాడు. ఓ యువకుడి మోసం వల్ల నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవాలనుకున్న విషాద ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. న్యాయం జరగలేదన్న మనోవేదనతో తీవ్ర నిర్ణయం తీసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.
———-
కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా చన్నరాయపట్న తాలూకా కల్లేసోమహళ్లికి చెందిన సూర్య, కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన నిష్మ బెంగళూరులోని ‘వైట్బర్డ్’ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒకేచోట పని చేస్తున్నారు. ఈ పరిచయం క్రమేణా వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని భావించి, గత ఐదు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొదట వీరి ప్రేమకు, పెళ్లికి అంగీకరించిన సూర్య తల్లిదండ్రులు కాలక్రమేణా వెనక్కి తగ్గారు. మరోవైపు నిష్మ తల్లి కూడా ఈ వివాహాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. పెద్దల ఒత్తిడి పెరగడంతో పాటు పెళ్లికి నిరాకరించిన సూర్య, గత సెప్టెంబర్ 24న తన మొబైల్ ఫోన్ను గదిలోనే వదిలి ఎవరికీ చెప్పకుండా అదృశ్యమయ్యాడు.
———–
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన జీవితంతో ఆడుకుని, చివరికి నట్టేట ముంచాడని తీవ్ర మనోవేదనకు గురైన నిష్మ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సూర్య కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ముందే నిష్మ తన మొబైల్లో ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేసింది. తన చావుకు ప్రియుడు సూర్య, అతడి తల్లిదండ్రులతో పాటు స్నేహితుడు ప్రవీణ్ కారణమని ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొంది.
————-
స్థానికులు, తోటి ఉద్యోగులు అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న నిష్మను తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బెంగళూరు మహాలక్ష్మి లేఔట్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న సూర్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు
బెంగళూరులో సహజీవనం పేరుతో మోసం
Latest Articles
- Advertisement -


