కులగణనపై అసెంబ్లీ తీర్మానం

    కులగణనకు తెలంగాణ ప్రభుత్వం జై కొట్టింది. వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కల్పించే కుల గణన తీర్మానానికి తాజాగా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలియచేసింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితితో పాటు బీజేపీ, మజ్లిస్,సీపీఐ కూడా కులగణనను స్వాగతిం చాయి. కులగణనకు తీర్మానం చేయడం అంటే తెలంగాణలో మరోసారి ఇంటింటి సర్వేకు ప్రభుత్వం సమాయత్తమైనట్లే. తెలంగాణ ప్రజలందరికీ దామాషా ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ పరంగా న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.

    దేశ రాజకీయాల్లో ఇటీవలికాలంలో కులగణన అంశం హాట్‌టాపిక్‌గా మారింది. సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలకు అడ్డుకట్ట వేయడంలో కులగణన ఎంతగానో తోడ్పడుతుంది. దేశంలోనే తొలిసారి కులగణన నిర్వ హించి శెహభాష్ అనిపించుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్. సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కుల గణన సర్వేను తమ స్వంత రాష్ట్రంలో విజయవంతగా చేపట్టారు నితీశ్ కుమార్. మొత్తం రెండు దశల్లో కులగణన ప్రక్రియను నితీశ్ కుమార్ పూర్తి చేశారు. బీజేపీ అసాధ్యమ నుకున్నదానిని నితీశ్ కుమార్ సుసాధ్యం చేసి చూపించారు. యావత్ భారతదేశానికి బీహార్‌ను ఒక రోల్ మోడల్‌గా ఆయన తీర్చిదిద్దారు. నితీశ్‌ కుమార్ బాటలో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయి కులగణన చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఒత్తిడి పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలువురు బీసీ సంఘం నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలోనూ కులగణన చేపట్టాలని కోరారు. బీసీ సంఘాల నేతల విజ్ఞప్తికి రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో కులగణనపై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణ నపై తాజాగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిని ఒక శుభ పరిణామంగా భావించాలి.

     ఇదిలాఉంటే కులగణనపై కేవలం తీర్మానం చేస్తే సరిపోదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. కులగణనకు చట్టబద్దత కల్పించాలని కోరాయి. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి కులగణన తీర్మానాన్ని శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందని గులాబీ పార్టీ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేవలం తీర్మానాన్ని ప్రవేశపెట్టి చేతులు దులుపుకునే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తోందని గంగుల కమలాకర్ ఆరోపించారు. కులగణనను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ప్రయోజనాలు కల్పించే కులగణ నకు ఒక నిర్దిష్ట గడువు విధించాలని గంగుల కమలాకర్ కోరారు. అంతే కాదు…సమగ్ర కులగణన చేస్తేనే కానీ, సమాజంలో వెనుకబడిన తరగతుల శాతం ఎంత అనేది తేలుతుందన్నారు గంగుల కమలాకర్.

    తీర్మానంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. కులగణన ప్రక్రియను ఏ ఫార్మాట్‌ లో చేస్తారని ఆయన ప్రశ్నించారు. కులగణన ప్రక్రియను బీసీ కమిషన్‌ ద్వారా చేస్తారా లేక ప్రత్యేకంగా వేరే కమిషన్‌ వేస్తారా? అనేది వెల్లడించాలని కడియం శ్రీహరి కోరారు. ఇదిలా ఉంటే కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తలాతోకాలేని తీర్మానాన్ని ఆమోదించి, ఏ విధంగా కులగణన చేస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని కవిత సూటిగా ప్రశ్నించారు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ. 4,500 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేసిందని కవిత పేర్కొన్నారు. అయితే ఆ నివేదిక ఇప్పటివరకు వెలుగు చూడలేదన్నారు. 2011నాటి కులగణన నివేదికను గాంధీ కుటుంబం తమ దగ్గర దాచిపెట్టుకుందా ? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

   వెనుకబడిన తరగతుల కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరి సహకారంతో కులగణన అంశాన్ని విజయవంతం చేస్తామన్నారు. కులగణనపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బడుగు, బలహీనవర్గాలకు మేలు చేయడానికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కులగణన ద్వారా అందే వివరాలతో బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక చర్యలు చేపడతామన్నారు మల్లు భట్టి విక్రమార్క. కులగణన తీర్మానంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు అనేక విధాలుగా ప్రయోజనాలు కల్పించే కులగణన ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగణనపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకె త్తేలా మాట్లాడటం మానేసి, సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాజేందర్ సచార్ కమిటీ ద్వారా ముస్లింల సర్వే చేపట్టిన విధంగానే తమ ప్రభుత్వం కూడా సర్వే చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వివరాలు అందితే కానీ, వెనుక బడిన తరగతులకు విద్య , ఉపాధి, పరంగా న్యాయం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Latest Articles

జోజిలా టన్నెల్ ప్రారంభం.. కశ్మీర్‌-లడక్‌ మధ్య దశాబ్దాల కల సాకారం

కశ్మీర్‌-లడక్‌ మధ్య దశాబ్దాల కల సాకారమైంది. జోజిలా టన్నెల్‌ను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన అతి పొడవైన సింగిల్‌- ట్యూబ్‌ బై డైరెక్షనల్‌ సొరంగ మార్గం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్