తాజా మేనిఫెస్టోతో దూకుడు పెంచిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ.. ప్రజాకర్షక హామీలతో ఓటర్ల ముందుకు వచ్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా మొత్తం 9 అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని ప్రకటించారు. చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామన్న ఆయన.. మోసం చేయడం, అబద్దాలు చెప్పడం తనకు తెలియదన్నారు. మరోవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.

మేనిఫెస్టో అనేది తమకు భగవద్గీత, బైబిల్, ఖురానులాగా ఎంతో ముఖ్యమైనది అన్నారు ఏపీ సీఎం జగన్. మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీతోపాటు, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేశారాయన. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 99 శాతం హామీలను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన ఆయన..58 నెలల్లో ఎన్నో పథకాలను డోర్ డెలివరీ చేశామన్నారు. 2 లక్షలా 70 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అందించామన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో ఇచ్చే మొత్తాన్ని 75 వేల నుంచి లక్షన్నరకు పెంచుతున్నట్లు ప్రకటించారు జగన్. కాపు నేస్తం పథకం కింద అందిస్తున్న సహాయాన్ని నాలుగు దఫాల్లో అరవై వేల నుంచి లక్షా ఇరవై వేలకు పెంపుదల చేయనున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే మొత్తాన్నిపెంపుదల చేసింది. ఇప్పుడున్న 15 వేల నుంచి 17 వేలకు పెంచింది. ఈబీసీ నేస్తం కింద ఇచ్చే మొత్తాన్ని నాలుగు దఫాల్లో 45 వేల నుంచి లక్షా ఐదు వేలకు పెంపుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు. పెన్షన్లను రెండు విడుతలుగా పెంచి 3500 ఇవ్వనున్నారు.

రైతులపైనా మేనిఫెస్టోలో వరాలు కురిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని16 వేల నుంచి పెంచకపోయినా.. కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని ప్రకటించడం కీలక అంశంగా మారింది. మత్స్యకారుల భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని రాబోయే ఐదేళ్లలో యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. వాహనమిత్ర కింద చేసే సహాయాన్ని యాభై వేల నుంచి లక్షకు పెంచనున్నా రు. అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వడం కొనసాగించనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా సహా మరికొన్ని ఇతర పథకాలను కొనసాగించనున్నట్లు ప్రకటించారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.

మేనిఫెస్టో విడుదల సందర్భంగా గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు జగన్. ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో వస్తున్నా రంటూ ఎద్దేవా చేశారు. సాధ్యం కానీ హామీలను చంద్రబాబు ఇస్తున్నారని, తనకు అలా అబద్దాలు చెప్పడం, మోసం చేయడం తెలియదన్నారు జగన్. అటు..రాజధాని విషయంలోనూ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామ న్నారు. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు జగన్. ఇక, గిగ్ వర్కర్లకూ వైఎస్సార్ బీమా పథకం వర్తింపచే యనున్నట్లు తెలిపారు జగన్. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు ఇవ్వనున్నట్లు ప్రకటిం చారు. వీటితోపాటు మరిన్ని హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు వైసీపీ అధినేత. మరి.. ఆయా పథ కాల కింద ఇచ్చే మొత్తాలు పెంచడం, కౌలు రైతులకు రైతు భరోసాలాంటివి వైసీపీకి ఏ మేరకు ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించి పెడతాయన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్