మరోసారి ప్రజాక్షేత్ర పోరుకు సిద్ధమవుతున్నారు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎర్రవల్లి నివాసానికే పరిమితమైన గులాబీ బాస్.. ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్‌ను నిలదీసేందుకు పక్కా ప్రణాళికను రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభత్వం ఇచ్చిన హామీలతోపాటు రుణమాఫీ, రైతు బంధు వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం జిల్లాల బాట పట్టనున్న ఆయన.. ఇప్పటికే పార్టీ నేతలతో ఈ అంశాలపై చర్చించి ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే,.. మరోసారి ఇదే అంశంపై లోతుగా చర్చించి కార్యాచరణ ప్రకటించే ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేసీఆర్ షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
జిల్లా పర్యటనలకు బయలుదేరుతున్న కేసీఆర్..లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సు యాత్ర చేపట్టాలా..? లేదంటే బహిరంగ సభలు నిర్వహించాలా అన్న దానిపై నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, రైతులతో సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్ర పోరుకు సిద్ధమవుతుండటంతో ఆయన ప్రసంగం, రేవంత్ సర్కార్‌పై ఎలాంటి విమర్శలు చేస్తారు..? ఏం మాట్లాడుతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.