34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తారా?..బీజేపీ ఆకర్ష్‌కు లొంగుతారా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒక పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను తమ వైపు తిప్పుకుని, వారికి కీలక పదవులు కట్టబెట్టడంలో భారతీయ జనతా పార్టీది అందెవేసిన చేయి. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి నేతలను బీజేపీలోకి తెచ్చిన మోడీ, అమిత్ షా ద్వయం.. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించకుండా.. మాతో కలిసి పనిచేయండి అంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ ప్రధాని నరేంద్ర మోడీ ఆఫర్ వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ లో బలమైన పునాదులు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమలం గూటికి చేరే అవకాశం ఉందా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని భారతీయ జనతా పార్టీ పక్కాగా అమలు చేస్తుంటుంది. అది జరిగే సందర్భాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈక్వేషన్స్ సెట్ చేయడంలో మోడీ, అమిత్ షా ద్వయం ఎప్పుడూ ముందుంటుంది. అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నాయకుడు. కానీ రాహుల్ గాంధీతో వచ్చిన విభేదాల వల్ల ఆయన బయటకు వచ్చారు. ఆ అవకాశాన్ని పసిగట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనను అక్కున చేర్చుకుని, ఏకంగా అస్సాం ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీకి కుడిభుజం లాంటి నాయకుడు. ఆమె ఏకపక్ష పోకడలను తట్టుకోలేక బయటికి వచ్చిన ఆయనను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తరఫున సీఎంగా సువేందు ఎదిగారు. ఇవన్నీ బయటకు సాధారణ రాజకీయ ప్రక్రియల్లా కనిపించినా, వీరిని క్యాప్చర్ చేసి పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేసింది ప్రధాని నరేంద్ర మోడీనే. పార్టీ అవసరాలకు అనుగుణంగా బలమైన నేతలను గుర్తించడం, ఆకర్షించడం బీజేపీ స్ట్రాటజీలో భాగం.

అస్సాం, బెంగాల్ తరహా ఆపరేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా అన్న చర్చ హఠాత్తుగా తెరపైకి వచ్చింది. నిజానికి ఈ ఊహాగానాలకు, ఈ చర్చకు ఆస్కారం ఇచ్చింది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే. ఆదివారం జరిగిన తెలంగాణ పర్యటనలో ప్రధాని మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. సాధారణంగా ఇతర పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి మీద ఆయన ఆ స్థాయిలో ఎలాంటి విమర్శలు చేయలేదు. దానికి బదులుగా ఏకంగా “మాతో రండి.. కలిసి పనిచేద్దాం” అని బహిరంగంగానే ఆఫర్ ఇచ్చారు. ఒక దేశ ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటీవల కాలంలో ఎన్నడూ ఇటువంటి ఆఫర్ ఇచ్చిన దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ ఏ పదం వాడినా దాని వెనుక కచ్చితంగా ఒక భారీ వ్యూహం ఉంటుందని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు ప్రధాని నేరుగా రేవంత్‌ను ఆహ్వానించడంతో, తెరవెనుక ఏదో బలమైన రాజకీయ మంత్రాంగం నడుస్తోందన్న చర్చ ఊపందుకుంది.

ప్రధాని మోడీ ఇచ్చిన ఈ ఆఫర్ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అధికారిక వేదికపై ప్రధాని అంతటి వ్యక్తి నేరుగా ఆఫర్ ఇచ్చేసరికి, రేవంత్ రెడ్డి అటు ఆ ప్రతిపాదనను తిరస్కరించలేక, ఇటు అవుననలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనపై ఉంది. ఈ ప్రోటోకాల్ కట్టుబాట్లను మోడీ అత్యంత చాకచక్యంగా వాడుకుని రేవంత్‌పై వల విసిరారు. మోడీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన గందరగోళం సృష్టించడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్, అగ్రెసివ్ నాయకుడు తమ పార్టీలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన కమలనాథుల్లో ఎప్పటినుంచో ఉంది. హిమంత బిశ్వ శర్మ తరహాలో రేవంత్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకువస్తే, తెలంగాణలో సునాయాసంగా పాగా వేయవచ్చన్నది ఢిల్లీ పెద్దల ప్లాన్. అయితే ఇదంతా కేవలం మోడీ ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రమేనని, కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్ రెడ్డికి మధ్య అనుమానపు బీజాలు నాటడానికే ప్రధాని ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు అన్నారని మరికొందరు సీనియర్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ప్రధాని ఆఫర్ ఇచ్చినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తారా, అసలు అది సాధ్యమేనా అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. అది కచ్చితంగా అసాధ్యమనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంత సులభంగా వదులుకోరు. అంతకు మించి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలమైన పునాదులు నిర్మించుకున్నారు. జాతీయ స్థాయిలో కేసీ వేణుగోపాల్ లాంటి పార్టీ మూలస్తంభాలు రేవంత్‌కు పూర్తి అండగా నిలుస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ పాత్ర వెలకట్టలేనిది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ‘ఊరికే రాలేదు రా బిడ్డ కూకున్న సీటు’ అన్న పాటకు తగ్గట్టుగానే ఆయన తన పొలిటికల్ కెరీర్‌ను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిర్మించుకున్నారు. సీఎం కుర్చీ దక్కించుకోవడానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు, ఎందరో ప్రత్యర్థులను ఎదిరించారు. కష్టపడి సాధించుకున్న ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేసి, ఇంత సులభంగా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రధాని మోడీ లాంటి వారు ఎంతటి బంపర్ ఆఫర్ ఇచ్చినా ఆయన కమలం గూటికి చేరే ఆస్కారం దాదాపు శూన్యమనే చర్చ జరుగుతోంది.

నరేంద్ర మోడీకి జాతీయ స్థాయిలో ఏ స్థాయిలో అయితే రాజకీయ లెక్కలు ఉన్నాయో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా రాష్ట్ర స్థాయిలో అటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ స్పష్టంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఎలా వ్యవహరించాలో, వాళ్ల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర నిధులు రాబట్టాలంటే ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగించడం అత్యవసరం. అందుకే ఆయన అధికారిక వేదికలపై మోడీకి తగిన గౌరవం ఇస్తూనే, తన రాజకీయ మార్కును కాపాడుకుంటున్నారు. ప్రధాని ఇచ్చిన ఆఫర్ వెనుక ఉన్న పొలిటికల్ మైండ్ గేమ్‌ను రేవంత్ పసిగట్టారు. మోడీ వేసిన ఈ స్కెచ్ కేవలం కాంగ్రెస్ కేడర్ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా చూపించడానికేనని ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఎక్కడా తొందరపడకుండా, తనదైన శైలిలో పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. అంతిమంగా నరేంద్ర మోడీ వ్యూహాలకు దీటుగా తన సొంత ఎత్తుగడలతో రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో బలంగా నిలబడుతున్నారన్నది కాదనలేని వాస్తవం. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్