34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దు.. విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోండి.. సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి” అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు వెనుక భారీ ఆర్థిక వ్యూహం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, డాలర్ల వినియోగాన్ని తగ్గించడం ప్రధాని ప్రధాన ఉద్దేశ్యమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం భారత విదేశీ మారక నిల్వలు సుమారు 690.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే అంతర్జాతీయ అనిశ్చితి పెరగడంతో ఈ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా ప్రకారం 2026 నాటికి భారత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 84.5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే దేశం నుంచి వెళ్లే డాలర్లు.. వచ్చే డాలర్ల కంటే ఎక్కువ అవుతున్నాయన్న మాట.

ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో బంగారం దిగుమతులు కూడా ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 24 శాతం అధికం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం కొనుగోలు దేశంగా భారత్ నిలిచింది. భారత్‌లో వినియోగించే బంగారం ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. ప్రతి గ్రాము బంగారం కొనడానికి డాలర్లే చెల్లించాల్సి వస్తోంది.

దేశ మొత్తం దిగుమతుల బిల్లు ఆర్థిక సంవత్సరం 2026లో 775 బిలియన్ డాలర్లకు చేరగా.. అందులో నాలుగు ప్రధాన వస్తువుల వాటా 240 బిలియన్ డాలర్లకు పైగానే ఉంది. క్రూడ్ ఆయిల్ కోసం 134.7 బిలియన్ డాలర్లు, బంగారం కోసం 72 బిలియన్ డాలర్లు, వెజిటేబుల్ ఆయిల్స్ కోసం 19.5 బిలియన్ డాలర్లు, ఎరువుల కోసం 14.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొత్తం దిగుమతుల్లో ఈ నాలుగు ప్రధాన వస్తువులే 31.1 శాతంగా ఉంది. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం ఒక్కటే దాదాపు 10 శాతం వాటా కలిగి ఉంది. అందుకే ప్రధాని మోదీ ఈ నాలుగు వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరారు.

బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే..

ఆర్థిక నిపుణుల ప్రకారం.. భారతీయులు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గిస్తే భారీగా డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉంది. బంగారం దిగుమతులు 30 నుంచి 40 శాతం తగ్గితే 20 నుంచి 25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. అదే 50 శాతం తగ్గితే 36 బిలియన్ డాలర్ల వరకు సేవ్ చేయవచ్చు. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటులో దాదాపు సగానికి సమానం.

అమెరికా- ఇరాన్‌ యుద్ధం వేళ…

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధి మార్గంలో చమురు రవాణాపై ప్రభావం పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. భారత్ తన అవసరాల్లో 88 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరలు పెరగడం వల్ల దేశానికి భారీ డాలర్ భారం పడుతోంది. ఇదే సమయంలో యుద్ధ భయాలతో ప్రజలు బంగారం కొనుగోళ్లకు పరుగులు తీస్తుండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.

బంగారం దిగుమతులు పెరగడం అంటే డాలర్ల డిమాండ్ పెరగడం. డాలర్ల డిమాండ్ పెరిగితే రూపాయి విలువ బలహీనపడుతుంది. దీంతో రిజర్వ్ బ్యాంక్‌పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రధాని మోడీ బంగారం కొనొద్దని చేసిన విజ్ఞప్తిని ఆర్థిక రక్షణ వ్యూహంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం కొనుగోళ్లకు బదులుగా ఏం చేయొచ్చు..

ఇక భౌతిక బంగారం కొనుగోలు చేయడం బదులు ప్రజలు గోల్డ్ ETFలు, SIPల వంటి ఆర్థిక పెట్టుబడుల వైపు వెళ్లాలని AMFI రిజిస్టర్డ్ MFD అభిషేక్ భిల్వారియా సూచిస్తున్నారు. ఇలా చేస్తే దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లకుండా.. డబ్బు భారత ఆర్థిక వ్యవస్థలోనే కొనసాగుతుందని ఆయన తెలిపారు.

లెమన్ మార్కెట్స్ డెస్క్‌కు చెందిన గౌరవ్ గార్గ్ ప్రకారం.. చమురు ధరలు భారీగా పెరిగినా ఇటీవల బంగారం ధరలు కొంత తగ్గాయి. ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ర్యాలీని పరిమితం చేస్తున్నాయని ఆయన చెప్పారు. అమెరికా ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు మరింత పెరిగాయని ఆయన విశ్లేషించారు.

Latest Articles

కరీంనగర్‌ పీఎంజే జ్యుయెల్లరీ దోపిడీ కేసులో పురోగతి… పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు దోచుకుని పరారైన ముఠాలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కేసు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్