36.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్‌కు కాంగ్రెస్ అధిష్టానం సీఎం పీఠం కట్టబెట్టింది. వాస్తవానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు ఉన్నప్పటికీ, ఆయనను పక్కనపెట్టి సతీశన్ కు అవకాశం ఇవ్వడం వెనుక చాలా రాజకీయ లెక్కలే ఉన్నాయని స్పష్టమవుతోంది. సాంప్రదాయంగా ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ వేణుగోపాల్ ఎందుకు సీఎం కాలేకపోయారు? కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ వైపు మొగ్గుచూపడానికి దారితీసిన ప్రధాన కారణాలు ఏంటి?

కేరళ రాజకీయాల్లో పది రోజుల పాటు జరిగిన తీవ్ర మంతనాలు, ఢిల్లీ స్థాయి చర్చల తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడీ సతీశన్ పేరును అధిష్టానం ప్రకటించింది. నిజానికి పార్టీ కీలక నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు కొత్తగా ఎన్నికైన మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడూ శాసనసభ్యుల బలం ఉన్నవారికే సీఎం పదవి దక్కుతుంది. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఈసారి మరో దారి ఎంచుకుంది. ఇక్కడ ఎమ్మెల్యేల మద్దతు కంటే.. ప్రజల మూడ్, క్షేత్రస్థాయిలో ఉన్న బలం, కూటమి సమీకరణాలకే రాహుల్ గాంధీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో కర్ణాటకలో సంస్థాగత బలం ఉన్న డీకే శివకుమార్ ను కాదని సిద్ధరామయ్యకు, అలాగే రాజస్థాన్ లో సచిన్ పైలట్ ను కాదని అశోక్ గెహ్లాట్ కు ఎలాగైతే అవకాశం ఇచ్చారో.. ఇక్కడ కూడా అదే ఫార్ములాను ప్రయోగించారు. సంస్థాగత వ్యవహారాలు చూసుకునే నేతకంటే, ప్రజలతో నేరుగా కనెక్ట్ అయిన నాయకుడికే రాహుల్ పెద్దపీట వేశారు.

అంతర్గతంగా ఎమ్మెల్యేల మద్దతు కేసీ వేణుగోపాల్ కు ఉన్నప్పటికీ, కేరళ పౌరుల సెంటిమెంట్ మాత్రం పూర్తిగా వీడీ సతీశన్ వైపే కనిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన తర్వాత, అప్పటిదాకా ఉన్న రమేష్ చెన్నితలను తప్పించి సతీశన్ కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన వామపక్ష ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా పునర్జీవం పోశారు. వేణుగోపాల్, చెన్నితల లాంటి సీనియర్ నేతలు రాష్ట్ర రాజకీయాల్లో అంతగా యాక్టివ్ గా లేని సమయంలో.. సతీశన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఆయన నాయకత్వంపైనే పూర్తిగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. సతీశన్ ను పక్కనపెడితే పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టులు అధిష్టానానికి అందాయి. సతీశన్ పేరు ప్రకటించగానే కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేసిన సంబరాలే.. అధిష్టానం గ్రౌండ్ రియాలిటీని ఎంత పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసిందో నిరూపించాయి.

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంలో యూడీఎఫ్ మిత్రపక్షాల అభిప్రాయాలు కూడా అత్యంత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని పైకి చెబుతున్నప్పటికీ, కూటమిలో 22 మంది ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేరుగా సతీశన్ అభ్యర్థిత్వానికే తమ పూర్తి మద్దతు ప్రకటించింది. మిగతా మిత్రపక్షాలు కూడా బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గతంగా ఆయన వైపే మొగ్గు చూపాయి. మరోవైపు, కేరళ కాంగ్రెస్ లో దశాబ్దాలుగా పాతుకుపోయిన ‘ఏ’, ‘ఐ’ గ్రూపుల ఆధిపత్య పోరుకు శాశ్వతంగా చెక్ పెట్టాలని జాతీయ నాయకత్వం గట్టిగా భావించింది. సతీశన్ ఈ రెండు డామినెంట్ గ్రూపులకు చెందని స్వతంత్ర నాయకుడు కావడంతో.. ఆయన ఎంపిక ద్వారా పార్టీలో సరికొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక ఫ్రెష్ ఇమేజ్ తీసుకురావడంలో, యువతను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారని హైకమాండ్ బలంగా విశ్వసించింది.

వీటన్నింటితో పాటు ‘హైకమాండ్ పాలిటిక్స్’ చేస్తున్నారన్న అపవాదు రాకుండా కాంగ్రెస్ ముందే జాగ్రత్త పడింది. క్షేత్రస్థాయిలో ఐదేళ్ల పాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన సతీశన్ ను కాదని, ఢిల్లీలో చక్రం తిప్పే వేణుగోపాల్ కు పీఠం కట్టబెడితే అది పారాచూట్ నాయకత్వం అవుతుందని భయపడింది. దానికి తోడు కేసీ వేణుగోపాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఆయన ప్రస్తుతం లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2026 ఎన్నికలకు ముందు.. సిట్టింగ్ ఎంపీలు ఎవరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న కఠిన నిబంధనను కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా అమలు చేసింది. ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలంటే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. తామే పెట్టుకున్న రూల్ ను తామే బ్రేక్ చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని అధిష్టానం లెక్కలు వేసుకుంది. గ్రౌండ్ లో ఉండి తిరిగి ప్రచారం చేసిన నేతకే పీఠం ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక సరైన ప్రజాస్వామ్య సందేశాన్ని ఇచ్చింది.

ఇక ఈ వ్యవహారంలో జాతీయ రాజకీయాల లెక్కలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఒకవేళ కేసీ వేణుగోపాల్ పూర్తిగా కేరళ రాజకీయాలకే పరిమితమై ముఖ్యమంత్రిగా వెళ్లిపోతే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే అత్యంత నమ్మకమైన నాయకుడు ప్రస్తుతం పార్టీలో లేరన్నది కాదనలేని సత్యం. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన వేణుగోపాల్ భవిష్యత్తులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి కూడా పోటీపడే అవకాశాలు ఉన్నాయని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ సీఎం రేసులో మాజీ మంత్రి రమేష్ చెన్నితల ఉన్నప్పటికీ.. ఆయనకు క్షేత్రస్థాయిలో గానీ, పార్టీ సంస్థాగతంగా గానీ పెద్దగా మద్దతు లభించలేదు. కుల సమీకరణాలు, పాత హామీల మీద మాత్రమే ఆయన ఆశలు పెట్టుకున్నారు. అటు అంతర్గత ఎమ్మెల్యేల అంకెలతో పాటు, పార్టీ భవిష్యత్తు, మిత్రపక్షాల ఆమోదయోగ్యత, పబ్లిక్ సెంటిమెంట్ లాంటి అన్ని ముఖ్యమైన అంశాలను పక్కాగా బేరీజు వేసుకున్న తర్వాతే రాహుల్ గాంధీ.. సతీశన్ కు సీఎం కుర్చీ కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

Latest Articles

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్