ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్‌లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా పరీక్షిస్తోంది. ఇందులో ఏఐ చాట్‌బాట్ సేవలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్ బుక్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ల ధర నెలకు రూ.99 కాగా, వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా నెలకు రూ.99గా నిర్ణయించారు. అయితే భారత్‌లో తొలి ఆరు నెలల పాటు వాట్సాప్ ప్లస్‌పై 50 శాతం రాయితీ అందుబాటులో ఉంది.
అలాగే అధికంగా వినియోగించే యూజర్ల కోసం మెటా మరింత అధునాతన ప్లాన్‌లను పరీక్షిస్తోంది. మెటా వన్ ప్లస్ ప్లాన్ ధర నెలకు సుమారు రూ.775 కాగా, మెటా వన్ ప్రీమియమ్ ప్లాన్ ధర నెలకు రూ.1,939గా ఉంది. ఈ ప్రీమియం ప్లాన్‌లలో అధిక ఏఐ రీజనింగ్ పరిమితులు, మెరుగైన కంటెంట్ జనరేషన్ సామర్థ్యాలు వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. ప్రస్తుతం మెటా ప్లాట్‌ఫారమ్‌లను ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3.5 బిలియన్ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.
ఏఐ రంగంలో పెరుగుతున్న భారీ ఖర్చులను భర్తీ చేసేందుకు మెటా ఈ చర్యలను చేపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. AI పోటీలో వెనుకబడిన స్థితి నుంచి బయటపడేందుకు సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వేగంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారని వారు భావిస్తున్నారు.


