38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షం నుంచి ప్రతిరోజూ విమర్శల దాడి జరుగుతున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లుతున్నా ఎదురుదాడి చేయకుండా మౌనం పాటిస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి తానే స్వయంగా స్పందించాల్సి రావడంపై ఆయన అసహనంతో ఉన్నారు. ఇంతకీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తోనైనా వారి తీరులో మార్పు వస్తుందా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ వాయిస్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్ష నేతలు నిత్యం ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ అధికార పక్షానికి తీవ్ర సవాల్ విసురుతున్నారు. కానీ ఆ విమర్శల తీవ్రతకు తగ్గట్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమాత్రం దీటైన కౌంటర్లు రావడం లేదు. విపక్షాలు ప్రభుత్వంపై, పాలనపై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే వారి పరిస్థితి తయారైంది. ప్రతిపక్షాలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటిస్తున్నారు. కేవలం ఆ నలుగురైదుగురు నాయకులు చూసుకుంటారులే అన్న నిర్లక్ష్యపు ధోరణి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా పెద్ద మైనస్ గా మారుతోందన్న చర్చ అంతర్గత వర్గాల్లో బలంగా జరుగుతోంది.

గతంలో ప్రభుత్వానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మంత్రులు, సీనియర్ నేతలు వెంటనే గాంధీభవన్‌కు చేరుకునే వారు. ఆ రోజు ప్రాధాన్యత కలిగిన అంశాలపైనా, ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆరోపణలపైనా ప్రెస్ మీట్లు పెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వారు. వారి దూకుడు చూసి ప్రతిపక్షాలు కూడా కాస్త ఆచితూచి వ్యవహరించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారెవరూ విపక్షాల ఆరోపణల పట్ల పెద్దగా స్పందించడం లేదు. ఏ సమస్య వచ్చినా, రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ వివాదం చెలరేగినా ప్రతిదానికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా రంగంలోకి దిగి సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను గాలికొదిలేసి సైలెంట్ గా ఉండటం అధిష్టానానికి సైతం చిరాకు తెప్పిస్తోంది. తాము ఎందుకు అనవసరంగా ప్రతిపక్షాలతో విమర్శలు ఎదుర్కోవాలన్న ఉద్దేశంతోనే కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పార్టీలో అందరూ ఒకేలా ఉన్నారని చెప్పలేము. కొందరు నాయకులు మాత్రం తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బల్మూరి వెంకట్, వేముల వీరేశం, ఆది శ్రీనివాస్ లాంటి నేతలు మాత్రమే తరచుగా బయటకు వచ్చి ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవలే విప్‌లను నియమించడంతో.. వేముల వీరేశం వారంలో కనీసం రెండు రోజులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలకు మాత్రం ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా మనసు ఒప్పడం లేదు. మరికొందరు నాయకులైతే ఏకంగా పార్టీ ఆఫీస్‌కు రావడం కూడా మానేశారు. ఏదైనా అంశంపై స్పందించాల్సి వస్తే నేరుగా తమ మొబైల్ ఫోన్లలోనే చిన్న చిన్న వీడియోలు తీసి మీడియా గ్రూపుల్లో పంపడానికి అలవాటు పడిపోయారు. ఈ తరహా సోఫా పాలిటిక్స్ పార్టీ క్యాడర్ కు ఏమాత్రం రుచించడం లేదు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కాలంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎవరి పనితీరు ఎలా ఉంది, విపక్షాల దాడులను ఎవరు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు అన్న విషయాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రికి ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారి పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో మీరంతా ఏం చేస్తున్నారు, పార్టీ కష్టకాలంలో ఉంటే మనకెందుకులే అని చూస్తూ కూర్చుంటారా అంటూ వారిని తీవ్రంగా మందలించారు. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టకపోయినా పర్వాలేదు కానీ, కనీసం మన ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి అయినా మీడియా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించడానికి మీకున్న ఇబ్బంది ఏంటని ఆయన వారిని నిలదీశారు. కనీసం ప్రెస్ మీట్స్ ఎలా పెట్టాలో కూడా మీకు తెలియదా అంటూ ఆయన గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. అధిష్టానం చెబితే తప్ప మీకై మీరు సొంతంగా స్పందించరా అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం క్లాస్ తీసుకుని వదిలేయకుండా శాసనసభ్యుల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రజలతో ఎంతమేర మమేకం అవుతున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళుతున్నారు అన్న దానిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదవులు తీసుకున్న వారు, ఇప్పుడు ప్రభుత్వ రక్షణ కోసం కవచంలా నిలబడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏ విషయమైనా ఆ నలుగురైదుగురు యాక్టివ్ లీడర్లే చూసుకుంటారులే అన్న ధోరణిని తక్షణమే విడనాడాలని ముఖ్యమంత్రి పరోక్షంగా హెచ్చరికలు పంపుతున్నారు. సీఎం చేసిన ఈ తాజా హెచ్చరికలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కచ్చితంగా కదలిక వస్తుందని అధిష్టానం ఆశిస్తోంది. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాస్తవాన్ని ఎమ్మెల్యేలు గ్రహించాల్సిన అవసరం ఉంది. పార్టీ పట్ల అంకితభావం చూపని వారిపై రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
————–

Latest Articles

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్