పోలవరానికి మోక్షం ఎప్పుడు ?

    కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ధర్మవరం పర్యటనతో పోలవరం ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరతామని పేర్కొన్నారు అమిత్ షా. అయితే కేంద్రంలో పదేళ్ల పాటు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ తరువాత రెండోసారి అంటే 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్డీయే కూటమిలో చాలాకాలం పాటు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్‌పై నరేంద్ర మోడీ సర్కార్ పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌పై ఒకదశలో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ …అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని ఘాటు ఆరోపణలు చేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు పోలవరం ప్రాజెక్ట్ మరుగునపడింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్, కేంద్రం మధ్య మంచి సంబంధాలే ఉండేవి. వాస్తవానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే కూటమిలో లేదు. అయినప్పటికీ బీజేపీకి అనధికారికంగా మిత్రపక్షంగానే కొనసాగుతోంది. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును సమర్థించే పార్టీల్లో ముందువరుసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. జగన్ ప్రభుత్వంతో ఇంత దోస్తీ ఉన్నప్పటికీ, పోలవరం ప్రాజెక్ట్‌ పై కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉంటే 2014లో తొలిసారి కేంద్రంలో అధికారానికి రాగానే పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని బీజేపీ ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చి తామే నిర్మాణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు సదరు హామీని నెరవేర్చలేకపోయింది నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. దీనికి కొన్నిసార్లు నెపం జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై వేసింది. మరికొన్ని సార్లు సాంకేతిక అంశాలను సాకుగా చూపించింది. పోలవరం ప్రాజెక్ట్‌ కల సాకారం చేయడానికి ఈ ఐదేళ్లకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, జలవనరుల శాఖ మంత్రులతో సమావేశమ య్యారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయవలసిందిగా కోరుతూ పలుమార్లు కేంద్రం పెద్దలకు వినతిపత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఈ ప్రయత్నాలేవీ ఫలితాలను ఇవ్వలేదు.

వాస్తవానికి జాతీయ హోదా ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. ప్రాజెక్ట్‌ కోసం మెజారిటీ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంది. అయితే ఒక దశలో కేంద్రప్రభుత్వం మెలిక పెట్టింది. స్వంత నిధులతో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయిన ఖర్చుల వివరాలను తమకు పంపితే వాటిని పరిశీలించి రీ యింబెర్స్‌ మెంట్ చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే పరిణామమే. అయినప్పటికీ దీనికి కూడా అంగీకారం తెలియచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ప్రకటన చేశారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకుంటారని చెప్పారు. అయితే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గడువు మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలవరం ప్రాజెక్ట్‌కు గడువు ప్రకటించారు. అది కూడా అసెంబ్లీ వేదికగానే. అయితే ఈ మాటను కూడా అనేక కారణాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిది.

ఒకదశలో ప్రాజెక్ట్‌లో సాంకేతిక లోపాలు కూడా తలెత్తాయి. ఈ సాంకేతిక లోపాలను ఎలా సరిదిద్దాలో తెలియక తలలు పట్టుకుంటున్న సమయంలో…కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ తొలిదశ నిర్మాణం పూర్తి చేయడానికి 2026 మార్చి నెలను తాజా గడువుగా నిర్ణయించింది. అంటే 2026కు కేవలం తొలి దశ పూర్తి కావాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్న మాట. అయితే మిగతా దశలు ఎప్పటికి పూర్తవుతాయన్న అంశంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. విభజన చట్టం ప్రకారం పదేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ పూర్తి కావడానికి మరో రెండేళ్ల గడువు పెట్టిందంటే కేంద్రం నిర్లక్ష్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇదిలా ఉంటే 2026లోగా నిధుల కేటాయింపులో ఆలస్యం, ఇతరత్రా కారణాలు తలెత్తితే ఆ గడువు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. అసలే పోలవరం ప్రాజెక్టుకు తాము ముందుగా నిధులు ఇవ్వబోమని, కేవలం ఖర్చు పెట్టిన నిధులకు రీయింబర్స్ మెంట్ మాత్రమే చేస్తామని తాజాగా కేంద్రం తేల్చేసింది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధుల్ని పెట్టుబడిగా పెట్టి దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంమీద పదిమందికి ఉపయోగపడాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌పై మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ప్రాజెక్ట్ ఇప్పటివరకు పూర్తికాకపోవడానికి కారణం మీరంటే కాదు మీరే నంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్తువెత్తుతు న్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్