దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే SLBC పనులు మొదలైనట్లుగా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా SLBC టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. అసలు ఏమిటీ ప్రాజెక్టు? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏయే ప్రాంతాలకు ఉపయోగం, ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సాగుతోంది?
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయగా.. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగం మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్ తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. రెండుచోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి రెండు వైపుల నుంచి అంటే ఇన్‌లెట్, అవుట్‌లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సి ఉంది. మరో సొరంగం 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది. ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్రణాళిక.
దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా, కొనసాగుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఏపీలోనే 52 శాతం పనులు పూర్తయ్యాయని… ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు అయ్యాయని నీటి పారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అనుమతులు లభించే పరిస్థితి లేదని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులు ఇచ్చింది.
సొరంగం నిర్మాణ మార్గంలో భూమి వదులుగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి. సొరంగం లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. టన్నెల్ మెషీన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ చాంబరు ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చేయాల్సి ఉంటుందని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారు.
కానీ, ఎస్‌ఎల్‌బీసీ విషయంలో రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు నడుస్తున్నందున కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి తలెత్తుతుంది. బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలని నిపుణులు అంటున్నారు.