సొంత కరెన్సీలోనే చెల్లింపులకు వర్ధమాన దేశాల ఆసక్తి
డాలరు రుణాలను చెల్లించలేక డీఫాల్ట్‌గా మారిన శ్రీలంక
డాలర్…..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ. అయితే రానున్న రోజుల్లో డాలర్ ప్రభ తగ్గనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలున్నాయి. వీటితోపాటు చిన్న, వర్థమాన దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కొంతకాలంగా విదేశీ వాణిజ్యం కోసం డాలరుకు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒక్క ఆసియాలోనే దాదాపు పన్నెండు దేశాలు డాలరుకు ప్రత్యామ్నాయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలోని అనేక దేశాలు ద్వైపాక్షిక చెల్లింపుల కోసం తమ కరెన్సీలనే ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో రష్యా, చైనాలను ప్రధానంగా చెప్పుకోవాలి. ఇతర దేశాలు తమకు ఇవ్వాల్సిన బకాయిలను రూబెల్స్ లోనే చెల్లించాలని రష్యా సూచిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం తరువాత ఈ ధోరణి ఎక్కువైంది. చైనా కూడా ఇదే బాటలో నడుస్తోంది. అనేక దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతోంది. విదేశీ వాణిజ్యానికి సంబంధించి చెల్లింపులను తమ దేశ కరెన్సీ లోనే చేయాలని చైనా సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మనదేశం కూడా రూపాయిని అంతర్జాతీయకరించడానికి గట్టి ప్రయత్నాలు చేసింది. కొన్ని రోజుల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ద్వైపాక్షిక చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది. రష్యాతోనూ చెల్లింపులను రూపాయిల్లో చేయడానికి ప్రత్యేక ఖాతాలు తెరుస్తోంది భారత్.
డాలరు బలోపేతం కావడం ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారింది. దీని ఫలితంగా అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో డాలరు దూకుడుకు బ్రేకులు వేయాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు డాలరు కు వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా భవిష్యత్తులో బ్రేకులు పడటం ఖాయమంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.