వాల్తేరు వీరయ్యకి, విశాఖలో పోలీసులకు మధ్య ఉన్న ఇబ్బందేమిటి? ఎందుకు ప్రీ రిలీజ్ వేదికను పదేపదే అటూ,ఇటూ మార్చి టెన్షన్…టెన్షన్ పెట్టారు. జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు, మరోవైపు ఒంగోలులో బాలయ్య సభకు ఇబ్బందులు లేకుండా అనుమతులివ్వడం…ఇప్పుడందరిలో మెదులుతున్న ప్రశ్నలు…సవాలక్ష సందేహాల మధ్య ఎట్టకేలకు ఆంధ్రా యూనివర్శిటీలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలు జరగనున్నాయి.
ముందుగా చెప్పాలంటే జగన్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం చిరంజీవికి పెద్ద పీట వేస్తూనే వచ్చింది. నేను పరిశ్రమ పెద్దని కాను, నాకు ఆ పెత్తనం వద్దంటున్నా, పలు సందర్భాల్లో సీఎం జగన్మోహనరెడ్డి మెగాస్టార్ చిరంజీవిని, సినీ పెద్దలను పిలిపించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కరోనా సమయంలో షూటింగులకు అనుమతులు ఇచ్చే విషయంలో గానీ, ఇండస్ట్రీలో సమస్యల విషయంలో, ఇంకా సినీ పరిశ్రమను విశాఖకు తరలించమని కోరిన సందర్భాల్లో సీఎం జగన్ తో చిరంజీవి ప్రముఖంగా చర్చించారు. జగన్ గెలిచి అధికారం చేపట్టినప్పుడు ప్రత్యేకంగా చిరంజీవి వెళ్లి కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు జన సేనాని పవన్ కల్యాణ్ స్పీడుగా వెళుతుంటే, అతన్ని కంట్రోల్ చేయడానికి చిరంజీవిని దగ్గరకు తీసుకుంటున్నారనే వాదనలు మరోవైపు నుంచి వినిపించాయి. ఈలోపు ఏమైందో తెలీదుగానీ…సడన్ గా చిరంజీవి గత కొద్దిరోజులుగా స్టాండ్ మార్చారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ గురించి వేదికలపై చెప్పడానికి ఇష్టపడని ఆయన, బహిరంగంగానే తమ్ముడికి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
పవన్ కల్యాణ్ అనుకున్నది సాధిస్తాడు, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయినా అవచ్చు చెప్పలేం, ‘‘వాడు అంటాడు, అనిపించుకుంటాడు’’, ఇలాంటి డైలాగులు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒక సందర్భంలో పవన్ తో సినిమా ఎప్పుడని విలేకరులు అడుగుతుంటే…నవ్వుతూ సమాధానాలివ్వడం, కొన్నిటికి నర్మగర్భంగా చెప్పడం చూస్తుంటే, అవి ఏమైనా అధికార పార్టీని ఇబ్బందులు పెట్టాయా? అన్నదమ్ములు కలిసిపోయారని అనుకుంటున్నారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తాజా సినిమా ‘గాడ్ ఫాదర్’ లో ‘‘రాజకీయాలకు దూరంగా ఉన్నానేమోగానీ, నానుంచి రాజకీయాలు దూరం కాలేదు’’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్స్ పాపులర్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే వాల్తేరు వీరయ్య వేదిక విషయంలో కావాలనే టెన్షన్ పెట్టారని అనుకుంటున్నారు. మరోవైపు రోడ్ షోలు, రాస్తారోకోలు, ప్రజా సభల విషయంలో తెచ్చిన జీవో నెంబర్ 1కి రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరు, గుంటూరు సభల్లో ప్రజలు మరణించడంతో వాతావరణం వేడెక్కి ఉన్న సమయంలో చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలపై ఇబ్బందులు తలెత్తాయి.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే…బాలయ్య బాబు వీర సింహారెడ్డి వస్తోంది. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. మరి బాలకృష్ణ కూడా అప్పోజిషన్ పార్టీయే…కానీ ఆ హీరో సభకి అనుమతులిచ్చి, ఈ హీరోని ఇబ్బంది పెట్టడంపై రకరకాల వ్యాక్యానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ముప్పుతిప్పలు పెట్టి సభకు అనుమతివ్వడంపై మెగా అభిమానులు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.