ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లి తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసి రావడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి, పవన్ పోటీ చేస్తున్నాడనే ప్రచారం దుమ్ము దుమారం రేపుతోంది. దాదాపు రెండు గంటలకు పైగా వీరిద్దరి సమావేశం జరిగింది.
జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ కు…సాక్షాత్తూ చంద్రబాబు గుమ్మం దగ్గర ఎదురువెళ్లి స్వాగతం పలికారు. పవన్ పుష్పగుచ్ఛం అందించగా, చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇద్దరూ ఏపీలో రాజకీయ పరిస్థితులపై రెండు గంటలపాటు చర్చించారు. ముఖ్యంగా జీవో నెంబర్ 1, లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్రలపై న్యాయ పోరాటం చేయడంపై కూడా చర్చించినట్టు తెలిసింది.
కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం, అక్కడ ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు పవన్ వెళ్లాడని చెబుతున్నా, అంతర్గతంగా మాత్రం ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా జగన్ సర్కార్ ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.



ఇద్దరూ కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటుచేసి, జగన్ సర్కార్ చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని తెలిపారు. రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, పొత్తులు గురించి ఇప్పుడే చెప్పలేమని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంతేకాదు గత నాలుగు రోజులుగా కుప్పం సంఘటనని చెబుతున్న చంద్రబాబు, మళ్లీ అదే విషయాన్ని మీడియా ముందు వివరించారు.
బీజేపీతో కలిసి వెళ్లాలని పవన్, చంద్రబాబు నిర్ణయించారనే సమాచారం వస్తోంది. ఇదే స్ట్రాటజీ తెలంగాణాలో కూడా అమలుచేయాలని అనుకుంటున్నారు. ఆంధ్రా సంగతి ఎలా ఉన్నా… తెలంగాణాలో బీజేపీ తోడు తీసుకువెళుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకమే అంటున్నారు.
ఇదిలా ఉండగా వీరిద్దరి కలయికపై వైసీపీ నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ముసుగు తొలగిపోయిందని ఒకరంటే, అధికార పార్టీ ఓటు బ్యాంకు ని చీల్చేందుకే, వీరిద్దరూ కలుస్తున్నారని మరొకరు అంటున్నారు. ఇది ఒక అనైతిక పొత్తు అని కూడా చెబుతున్నారు. ప్యాకేజీల కోసమే మాట్లాడుకున్నారని మరికొందరు అంటున్నారు.