రోజురోజుకు తెలంగాణలో ఎన్నికల రాజకీయాలు ఎండలకంటే ఎక్కువగా కాకపుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎన్నికల వేళ ఎక్కడ చూసినా ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో రహదా రులు కిక్కిరిసిపోయాయి. సామాన్యుడి నుండి అసామాన్యుల వరకు రాజకీయ చర్చోపచర్చలతో ఇంటింటా… వీథివీథినా… ఎన్నికల సందడే కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం నామినేషన్లకు ముందు తరువాత అన్నట్టు నేతల రాజకీయాలు పూర్తిగా రూపాలను మార్చు కున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చెయ్యడానికి, ఎత్తుకు పైఎత్తులు.. సమీకరణలతో రాజకీయం అంటే ఇది కదా! అన్నట్టు తయారైంది పరిస్థితి. సవాళ్లు ప్రతి సవాళ్లతో బస్తీమె సవాల్ అంటూ నేతలు చెలరేగిపోతున్నారు. అధికార పక్షం తోపాటు విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతు న్నారు.
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. అయితే 17లోక్ సభ నియోజకవర్గాల్లో దాదాపు 625 మంది అభ్యర్థుల నామినేషన్లు అర్హతను సాధించాయి. ఇదిలా ఉంటే ఒక్క మెదక్ ఎంపీస్థానంలోనే 53 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. పెద్దపల్లిలో 43 మంది అభ్యర్థులు బరిలోకి దూకారు. దీంతో ఇక ప్రధాన పార్టీల నేతలు…ప్రత్యర్థులుగా… రెబల్స్ గా ఎన్నికల రణక్షేత్రంలోకి దూకినవారితో బేరసారాలకు దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజుతో గడువు ముగియనుండడంతో నగదు నజరానాలు ఆశచూపిస్తున్నారు. నేతల గెలుపు సంగతి ఎలా ఉన్నా రెబల్స్ నామినేషన్లతో ఓట్లు చీలి, ప్రత్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలా సునాయాసం అవుతుందని ప్రధాన అభ్యర్థుల గుండెల్లో గుబులు పట్టుకుంది.ఇదిలా ఉంటే వచ్చే నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఒక్కో పార్టీ ఒక్కో ప్రచార అస్త్రాన్ని ఎంచుకుంది. ఎవరి అస్త్రాలతో వారు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అయ్యారు. ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రానున్నది ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రజల్లోకి జోరుగా ప్రచారం చేసుకుంటుంది. బీజేపీ మాత్రం కమలానికి ఓటేస్తే రామరాజ్యం తెస్తామని, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఇంటింటి ప్రచారానికి తెరలేపారు. బీజేపీ అగ్రనేతల పర్యటనలతో తెలంగాణలో ఎలాగైనా.. డజను ఎంపీ సీట్లు గెలవాలని గట్టి పట్టు మీదే ఉంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుందామని బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలను నమ్మి ఓటమి పాలైన గులాబీ పార్టీ మాత్రం సారు…..కారు…పదహారు వంటి నినాదాలను పక్కన పెట్టి ఇప్పుడు మనుగడ కోసమే ఆరాటపడుతుంది.
ఆరు గ్యారెంటీలతో అధికార పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ….ఇప్పటికే పలు గ్యారెంటీలను అమలు చేసి, ప్రజల్లో బలంగా ప్రచారం చేసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి అధికార పీఠం ఎక్కే ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ కు జై కొట్టారు. దీంతో రాష్ట్రంలో ఆటోవా లాలకు గిరాకీలు లేక ఈసురోమంటూ ఉసురు తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే చాలా మంది ఆటోవాలాలు మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల జీవన భృతి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆటోవాలాల ఓట్లు కాంగ్రెస్ కు వ్యతిరేక ఓటుగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. నాలుగు నెలల పాలనా వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లస్ ను ఒక మైనస్ ను తన ఖాతాలో జమ చేసుకుంది.
ఇక ఆరు గ్యారెంటీలలో రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ భీమా పెంపు, ఇందిర మ్మ ఇళ్లు ..వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. రానున్న రోజుల్లో పంటల భీమా, రైతు భరోసా, వరికి బోనస్, పెన్షన్లు తదితర హామీలను రానున్న రోజుల్లో అమలు చేయనున్నట్లు, కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం చేసుకుం టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళా ఓటర్లపైనే ఫోకస్ పెట్టి 1.2 ఓట్ల శాతంతో అధికారం చేజిక్కించుకుంది. ఈసారి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లతో పోలిస్తే, మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాంటి ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ఆధిపత్యం ఉన్న సెగ్మెంట్ల పై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టే లాభపడిందని సర్వత్రా తెలిసిన విషయమే. ఇదిలా ఉంటే లోక్ సభ స్థానాల్లో సీట్లు ఆశించి భంగపడ్డ బడా చోటా మోటా నేతలంతా ఎంపీ స్థానాల్లో నామినేషన్లు వేసి, అధికార ..విపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే అందివచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా లేదా అనే సందేహాలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ లో వలస నేతల హడావిడి పెరగడంతో రేవంత్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కాంగ్రెస్ కు అభ్యర్థుల కొరత కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటల సీఎమ్మా.. చేతల సీఎమ్మా అంటూ విపక్షాల నుండి సెటైర్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.
రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి పాకాన పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరితే..అంతే ధీటుగా ప్రతిసవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. అగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే, తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తే..తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే..రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ సవాళ్ల రాజకీయాలను ప్రజలను యాక్షన్ మూవీ చూస్తున్నట్టు గుంభనంగా చూశారు. మరి ఈ సవాళ్లు ఎవరికి మేలు… ఎవరికి చేటు అనేది కాలం తేల్చాల్సిందే ..సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన సవాల్ రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేశాయి. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్.. అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సవాల్ విసిరారు. మరో అడుగు ముందుకేసి ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుని.. కాంగ్రెస్ తరపున ప్రచారానికి సిద్ధమని సంచలన సవాల్ విసిరారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రాజకీయం రసవత్తరంగా రంజుగా సాగుతుంది.
నాలుగు నెలల పాలనలోనే కాంగ్రెస్ ఘోర వైఫల్యాలను మూటగట్టుకుందని మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ విమర్శిం చారు. అడ్డగోలు హామీలతో, కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది చేతగాని అసమర్థ పాలన అంటూ ధ్వజమెత్తారు. కక్ష్యసాధింపు చర్యలతో రేవంత్ రెడ్డి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం లోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా… ఇప్పటికీ రైతు బంధు వేయలేదు…కరెంట్ కోతలతో ప్రజలు సతమతమవుతున్నారని, ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఆవేదన చెందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పాలనను మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. కేవలం నాలుగు నెలల్లో 220 మంది రైతులు అనేక ఇబ్బందులతో చనిపోయారని, ఇది కారు తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒట్టులకు దేవుళ్లు కూడా పారిపోతున్నారని, ఇటీవల ఒక సభలో కేటీఆర్ రేవంత్ ను చమత్కారంగా దెప్పిపొడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న గ్యారెంటీలను మహిళా ఓటర్లకు బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఇటీవల తుక్కుగూడ లో జరిగిన జన జాతర సభలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరించింది. మహిళా ఓటర్లకు గాలం వేయడానికి కాంగ్రెస్ శాయశక్తుల కృషి చేస్తోంది. ఇదే గనక జరిగితే మళ్లీ లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించడం ఏమంత కష్టం కాదనే వాదనలు సైతం బలంగానే వినిపిస్తున్నాయి.
మొత్తం మీద ఇ్నపటి వరకు జరిగిన ఎన్నికల రాజకీయ ఎపిసోళ్ల ను పరిశీలిస్తే…సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలతో మొత్తానికి గులాబీ గూడును వలసలతో ఖాళీ అయ్యేలా చేశారు. దీంతో గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా, పార్టీ ఉనికిని కాపాడుకోవడమే పెద్దపనిగా మారింది బీఆర్ఎస్ అధినేతకు. మొత్తం మీద సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య నాలుగు నెలల కాంగ్రెస్ పాలనకు పెద్దగా వ్యతిరేకతలు లేకపోయినా, చెప్పు కోదగ్గ పాజిటివ్ అంశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి సవాళ్ళను, శపథాలను నిలబెట్టేలా పట్టం కడతారో వేచి చూడాల్సిందే..


