కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకతులమవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపిలేకుండా భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో చెన్నై సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెన్నైలోని అడయార్, పెరంబూరు, కేకేనగర్, గిండి, వేలచేరితో సహా పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో జనం నానా అవస్తలు పడుతున్నారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. సబ్‌వేల్లో వాహనాలు నీటమునిగాయి. ఇప్పట్లో వరుణుడు వదిలేలా లేకపోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో చైన్నై సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారి చేసింది వాతావరణశాఖ. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్లు, కడలూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. అలాగే మరోమూడు రోజులపాటు ఇంటి నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచించారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో అలర్ట్ అయిన సర్కార్ సహాయక చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే మంత్రులు కెఎన్ నెహ్రూ, శేఖర్‌బాబు, చెన్నై మేయర్ ప్రియ వరద సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.