ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు సంబంధించి జరగనున్న ఎన్నికల విషయంలో మరో కీలక ఘట్టం పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవడంతో ఏయే నియోజకవర్గాల నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అన్న అంశంపై క్లారిటీ వచ్చేసింది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఎక్కువ మంది పోటీ పడుతుండగా.. విశాఖపట్నం లోక్ సభ సీటు నుంచి అత్యధికంగా కేండిడేట్లు బరిలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరం ఏపీలో హోరాహోరీగా సాగుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. దశాబ్ద కాలం తర్వాతైనా ప్రభావం చూపించాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగా ఎక్కడికక్కడ విస్తృతంగా ఆయా పార్టీల అధినేతలు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
అయితే.. మొన్నటి వరకు ఆయా పార్టీల తరఫున నియోజకవర్గాల్లో ఎవరెవరు బరిలో ఉంటారన్న దానిపై క్లారిటీ లేదు. టికెట్లు దక్కని చోట్ల పలువురు రెబల్స్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మరికొందరు ప్రజాసేవ చేయాలన్న ఆసక్తి కొద్దీ స్వతంత్రులుగా పోటీ చేశారు. దీంతో.. ఒక్కో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎంత మంది పోటీ పడతారు.. పార్లమెంటు బరిలో ఎంత మంది మిగులుతారు అన్న దానిపై ఓ స్పష్టత లేని పరిస్థితి. అయితే.. తాజాగా నామినేషన్లకు ఉపసంహరణ గడువు సైతం ముగియడంతో ఆయా అసెంబ్లీ స్థానాల వారీగా పోటీలో ఉన్న వాళ్లు, లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు.. ఎంతమంది అనే దానిపై ఓ స్పష్టత వచ్చేసింది.
అసెంబ్లీ స్థానాల వారీగా చూస్తే.. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో తిరుపతి నుంచి అత్యధిక మంది పోటీలో ఉన్నారు. మొత్తం 46 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో మంగళగిరి నిలిచింది. ఇక్కడి నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ ఉండగా.. మొత్తం 40 మంది పోటీపడుతున్నారు. బనగానపల్లె, నంద్యాల, గుంటూరు పశ్చిమం నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక్కో సీటు నుంచి 28 మంది నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నారు.
ఇక, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలో కేవలం ఆరుగురు మాత్రమే పోటీపడుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, కురుపాం శాసనసభా స్థానాలున్నాయి. వీటిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఏడుమంది చొప్పున మాత్రమే బరిలో నిలిచారు. లోక్ సభా స్థానాల విషయానికి వస్తే.. విశాఖ నుంచి అత్యధికంగా 33 మంది పోటీలో మిగిలారు. ఆ తర్వాతి స్థానంలో నంద్యాల పార్లమెంటు సీటు ఉంది. ఇక్కడి నుంచి 31 మంది కేండిడేట్లు పోటీపడుతున్నారు. గుంటూరు నుంచి 30 మంది, ఒంగోలు బరిలో 25 మంది, తిరుపతి పార్లమెంటు స్థానానికి 23 మంది పోటీలో మిగిలారు. ఇక, తక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతున్న పార్లమెంటు సీట్ల విషయానికి వస్తే… రాజమండ్రి మొదటి వరుసలో ఉంది. ఇక్కడి నుంచి 12 మంది తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నర్సాపురం బరిలో 13 మంది నిలిచారు. ఇక, నెల్లూరు, కడప, బాపట్ల ఎంపీ సీట్ల నుంచి 14 మంది చొప్పున ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ఏపీ వ్యాప్తంగా 175 శాసనసభా స్థానాల్లో 2 వేల 387 మంది, 25 ఎంపీ సీట్లకు 454 మంది పోటీలో నిలిచారు. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుంది ? ఎవరిని అందలమొక్కిస్తారు ? అన్నది ఉత్కంఠ రేపుతోంది.


