ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమించింది. ఊరువాడా సభలు పెట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది గులాబీ పార్టీ. తెలంగాణ ప్రజల గొంతుకై నిలిచింది టీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా గులాబీ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది. సాగరహారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె పేర్లతో నిర్వహించిన ఆందోళనా కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల కు దగ్గర చేశాయి. అంతేకాదు ఉద్యమ సాధనలో భాగంగా గులాబీ పార్టీ నాయకులు అనేకసార్లు పదవుల కు రాజీనామాలు చేశారు. తమకు పదవుల కంటే ప్రత్యేక రాష్ట్ర సాధనే ముఖ్యమని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా చేసుకుని గులాబీ పార్టీ అనేక ఆందోళనలు నిర్వహించింది. ప్రతి ఆందోళన, ప్రతి నిరసన ప్రదర్శన దేనికదే ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టం సాగరహారం. లక్షలాదిమంది ఒకచోట చేరి జై తెలంగాణ అంటూ నినదించిన రోజు అది. యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిడికిలి బిగించిన చారిత్రక సందర్భమది. 2012 సెప్టెంబర్ 30న నిర్వహించిన సాగరహారం. మలిదశ ఉద్యమంలో ఒక మహోజ్వల ఘట్టంగా చరిత్రలో నిలిచింది. సాగరహారంతో భాగ్యనగరం రణరంగంగా మారింది. ఒక యుద్ధభూమిగా మారింది. పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగాలను లెక్క చేయకుండా అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించుకుని చీమలదండులా కదలివచ్చారు తెలంగాణ ప్రజలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన వచ్చేవరకు కదిలేది లేదని అక్కడే భీష్మించుకు కూర్చున్నారు.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు పరిసరాలలో ఎటు చూసిన జనమే జనం కనిపించారు. నెక్లెస్ రోడ్డు, పీవీ ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ఎక్కడ చూసినా నేల ఈనిందా అనేటట్లు కనిపించారు ప్రజలు. పరిసర ప్రాంతాలన్నీ ఇసుకవేస్తే రాలనంతగా జనసంద్రంగా మారాయి. యావత్ హైదరాబాద్ నగరం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమంటూ ఒక్కటై నినదిం చింది యావత్ తెలంగాణ సమాజం.
మిలియన్ మార్చ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరో మహోజ్వల ఘట్టం ఇది. తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 2011 మార్చి 10న తెలంగాణవాదులందరూ కలిసి మిలియన్ మార్చ్ నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు పోలీసుల నిర్బంధాన్ని ఎదురించి ట్యాంక్ బండ్‌కు వచ్చి తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమనేత కేసీఆర్ స్వయంగా మిలియన్ మార్చ్ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడై నిలిచారు.
యావత్ తెలంగాణ సమాజాన్ని ప్రత్యేక రాష్ట్రం కోసం ఏకం చేయడంలో భాగంగా జరిగిన మరో ఆందోళనా కార్యక్రమమే సకుల జనుల సమ్మె. ఈ సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ సమాజం భాగస్వామ్యమైంది. సకల జనుల సమ్మె మొత్తం 42 రోజుల పాటు జరిగింది. ఇంత సుదీర్ఘకాలం జరిగినా, ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదు. ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ప్రధానోద్దేశంగా సకుల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు కేసీఆర్. సకల జనుల సమ్మె సూపర్ డూపర్‌గా హిట్టయ్యింది. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు తెలంగాణ సమాజం సంపూర్ణ మద్దతు తెలియచేసింది. అలాగే సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, టీచర్లు,కార్మికుల కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు అండగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే సకల జనుల సమ్మె విజయవంతం కావడంతో తెలంగాణ ఉద్యమకారుల్లో జోష్ పెరిగింది.
తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ నాయకులు అనేక త్యాగాలు చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమే కేసీఆర్ రాజీనామాతో మొదలైంది. టీఆర్ఎస్ పార్టీ పెట్టేనాటికి కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గానూ ఉన్నారు. ఈనేపథ్యంలో పదవులను వదులుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీ ద్వారా లభించిన శాసనసభ్య త్వానికి ఆయన రాజీనామాలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు కేసీఆర్. ప్రజల ఆశయ సాధనే తన లక్ష్యమని టీఆర్ఎస్ ఆవిర్భావంరోజునే కుండ బద్దలు కొట్టారు కేసీఆర్.
ఆ తరువాతికాలంలో తెలంగాణలో అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి. ఒకదశలో కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా చేరారు. అయితే కేంద్రమంత్రిగా కొద్దికాలమే కేసీఆర్ కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2006 ఆగస్టు 20న కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ తరువాత 2006 సెప్టెంబర్ 12న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కేసీఆర్. అదే ఏడాది జులై ఎనిమిదో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాము లుగా ఉన్న ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు పదవులకు గుడ్ బై కొట్టారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడంలో భాగంగా 2008 మార్చి నాలుగో తేదీన నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలతో పాటు 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఒకదశలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి నిరసనగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేయాలని గులాబీ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 2010 ఫిబ్రవరి 14న టీఆర్ఎస్‌కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామాలతో ఉద్యమ వేడి తగ్గకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒక్కమాటలో చెప్పాలంటే తమకు పదవులు ముఖ్యం కాదని టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సమా జానికి తేల్చి చెప్పారు.


