సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్.. ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేనేలేదు. అయితే.. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగారు వారి కుటుంబ సభ్యులు. ఇంట్లోని వారందరూ ప్రచారానికి వచ్చి తమ వాళ్లకు మద్దతుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ప్రచార పర్వం హోరెత్తుతోంది. వచ్చేనెల 13న పోలింగ్ ఉండడంతో ఉధృతంగా కేంపెయినింగ్ నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఓవైపు ఎండలు మండుతున్నా తగ్గేది లేదంటూ ముందుకె ళుతున్నారు. అయితే.. ఈ ప్రచార పర్వంలో అభ్యర్థులే కాదు.. వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో దిగిన వసంత కృష్ణ ప్రసాద్‌కు మద్దతుగా ఆయన కుమారుడు కేంపెయినింగ్ చేస్తున్నారు. ప్రధానంగా యువతను ఆకట్టుకునేలా ధీమంతు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రచారంలో ఎక్కడికక్కడ అధికార పార్టీ తీరు ఎండగట్టేలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు ధీమంత్. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని గుర్తు చేస్తున్న ఆయన.. కూటమి అధికారంలోకి వస్తే.. ఉద్యోగాలు వచ్చేలా చేస్తామంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని.. తమ పార్టీ గెలిచిన తర్వాత రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామని హామీనిస్తూ ముందుకు సాగుతున్నారు ధీమంత్.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. ఆయన తోపాటు ఆయన కుమార్తె కేశినేని శ్వేతా సైతం విజయవాడలో కేంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఆమెకు విజయవాడ కార్పొరేటర్ గా చేసిన అనుభవం ఉండడంతో నగర ప్రజలకు ప్రభుత్వం తరఫున అందించిన పథకాలను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.మూడు రాజధా నులు ఉండడం వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలియజేస్తున్నారు కేశినేని కుమార్తె శ్వేత. అమరావతి రాజధాని ఒకటే ఉండడం వల్ల ఇక్కడ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందడు తుందని అదే మూడు రాజధానులు ఉంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరిస్తు న్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపైనా విమర్శలు గుప్పిస్తున్నారామె. అయితే.. ఇక్కడ తన తండ్రి నానికి పోటీగా సొంత బాబాయే ఉండడంతో.. విజయవాడలో శ్వేత ప్రచారం ఆసక్తికరంగా మారుతోంది.
మరోవైపు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పోటీ చేస్తుండగా.. ఆయన తరఫున ప్రచారం జోరుగా చేస్తున్నారు తనయుడు కార్తీక్. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేయకపోవడంతో నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. తన తండ్రిని గెలిపిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తా మంటూ ప్రజలకి హామీ ఇస్తున్నారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న కూటమి నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. తన తండ్రి సుజనా చౌదరి గెలుపు కోసం తన వంతు పాత్ర పోషిస్తున్నారు కార్తీక్. మొత్తంగా.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓవైపు.. వారి కుటుంబ సభ్యులు మరోవైపు ప్రచారం నిర్వహిస్తూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మరి.. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అన్నది త్వరలోనే తేలనుంది.


