స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు వాటర్ ట్యాంకర్ లారీ కిందకు తోసి ప్రియుడు హత్య చేసిన ఘటన నిజాంపేట (Nizampeta) పరిధిలో జరిగింది. సీఐ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రమీల, తిరుపతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రమీల సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్నారు. తిరుపతి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని తిరుపతిని ప్రమీల కోరారు. ఇదే విషయంపై ఆదివారం ఇద్దరూ బాచుపల్లి(Bachupalli) వద్ద కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అటువైపుగా వాటర్ ట్యాంకర్ (Water Tanker)లారీ రావడాన్ని గమనించిన తిరుపతి కావాలనే ఉద్ధేశపూర్వకంగా ప్రమీలను లారీ కిందకు తోసేశాడు.
దీంతో లారీ యువతిని ఢీకొట్టి ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి బాయ్ ఫ్రెండ్ తిరుపతి, ట్యాంకర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, మొదట రోడ్డు ప్రమాదంగా, యువతి అనుమానాస్పద మృతిగా భావించారు. యువతిని బాయ్ ఫ్రెండ్ తోసి వేశారా? ప్రమాదవశాత్తు లారీ కిందపడి చనిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించి పరిశీలించారు. తిరుపతిని విచారించగా అతను కావాలనే ప్రియురాలు ప్రమీలను లారీ కిందికి తోసి వేశాడని పోలీసులు నిర్ధారించారు.